ప్రజలను మోసం చేస్తున్న నటి అంజలి.. చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు

శుక్రవారం, 4 అక్టోబరు 2019 (08:47 IST)
సినీ నటి అంజలి.. పదహారణాల తెలుగు పిల్ల. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో మంచి పాపులర్ అయింది. ఆ తర్వాత పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించింది. కేరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ప్రేమలో పడింది. ఆ తర్వాత వారం పదిరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. పిన్ని వేధింపులు భరించలేక ఇలా చేసినట్టు చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి అంజలికి సినీ అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. ఫలితంగా వెండితెరకు దూరమైపోయింది. 
 
ఈ క్రమంలో ఓ వంట నూనెల తయారీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌ (ప్రచారకర్త)గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ వంట నూనెలు ఆరోగ్యానికి హానికరంగా ఉన్నాయంటూ పలు పరిశోధనల్లో తేలింది. దీంతో ఈ నూనెలకు ప్రచారం చేస్తున్న నటి అంజలిపై చర్య తీసుకోవాలంటూ కోవై సుడర్‌పార్వై మక్కల్ ఇయక్కం ఆహార భద్రతా శాఖాధికారికి ఫిర్యాదు చేశారు. 
 
ఈ మేరకు ఆ ఎన్జీవో సంస్థ అధ్యక్షుడు సత్యంగాంధీ గురువారం కోవై ఆహార భద్రత శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈరోడ్ కేంద్రంగా ఉండే ఈ నూనెల తయారీ కంపెనీ నిబంధనలు పాటించకుండా తయారుచేస్తున్న నూనెను కోవై జిల్లాలో పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని, తయారీదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నటి అంజలి కూడా హానికరమైన నూనెలకు ప్రచారకర్తగా ఉంటూ ప్రజలను మోసం చేస్తున్నారని, అందువల్ల ఆమెపై చర్యలు తీసుకోవాలని సత్యంగాంధీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు