బాలీవుడ్ నిర్మాతకు అండగా నిలిచిన అక్షయ్ కుమార్.. రూ.17 లక్షల ఆర్థిక సాయం

శుక్రవారం, 21 అక్టోబరు 2016 (13:43 IST)
ఆపదల సమయంలో ఆపన్న హస్తం అందించేందుకు ఎప్పుడూ ముందుండే ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఇప్పటికే ఎందరికో, ఎన్నోసార్లు సాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్న అక్షయ్ కుమార్... ఇటీవలే ఉరీ ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేశాడు. గతంలో కూడా చెన్నై వరద బాధితులకు కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చి ఆదుకున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నిర్మాత రవి శ్రీవాస్తవకు రూ.17 లక్షలిచ్చి అండగా ఉన్నారు. 
 
వివరాల్లోకి వెళ్తే, గత కొంతకాలంగా శ్రీవాస్తవ మూత్రపిండాల సమస్యతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు వెంటనే ఆపరేషన్ చేయాలని, దానికి రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు వెల్లడించారు. అయితే వైద్యం చేసుకోవడానికి అంత స్తోమత లేని శ్రీవాస్తవ... దేవుడి మీదే భారం వేసి ఆపరేషన్‌ని వాయిదా వేశారు. చివరకు సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకున్న అక్షయ్ కుమార్ వెంటనే రూ.17 లక్షలను ఆయనకు పంపించాడు. ఇంకా ఏవైనా ఖర్చులు ఉంటే మొహమాటం లేకుండా అడగమని భరోసా ఇచ్చాడు. అక్షయ్ చేసిన సహాయానికి కన్నీటితో కృతజ్ఞతలు చెప్పారు శ్రీవాస్తవ.

వెబ్దునియా పై చదవండి