ప్రతిరోజూ ఆవు మూత్రం తాగే బాలీవుడ్ స్టార్ హీరో ఎవరు?

శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (16:01 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో ఒకరు అక్షయ్ కుమార్. దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే చాలు.. ఆయన చేతికి ఎముకే లేదన్నట్టుగా వ్యవహరిస్తారు. ఇందుకు నిదర్శనమే, కరోనా వైరస్ నియంత్రణ సహాయ చర్యల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు ఏకంగా 25 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. అలాంటి స్టార్ హీరో ప్రతి రోజూ ఉదయం గోమూత్రం తాగుతారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 
 
నిజానికి అక్షయ్ కుమార్ లైఫ్‌స్టైల్ చాలా కఠినంగా విభిన్నంగా ఉంటుంది. ఆయన రోజువారి దినచర్యలను తు.చ తప్పకుండా పాటిస్తుంటారు. క‌ఠిన‌త‌ర‌మైన ఆహార నియ‌మాల‌ను పాటించే అక్ష‌య్ ప్ర‌తీ రోజూ గోమూత్రం సేవిస్తాడ‌ట‌. బేర్ గ్రిల్స్, హుమా ఖురేషిలతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌చాట్ సందర్భంగా అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
'ఇంటు ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్'లో కొన్ని డేర్ డెవిల్ స్టంట్స్ అక్షయ్ కుమార్ ప్రదర్శిస్తారు. చెట్టుకు కట్టిన తాడు నిచ్చెన ఆధారంగా ఒక నీటి ప్రవాహాన్ని దాటుతారు. ఇలాంటి స్టంట్స్ ఎలా  చేయగలిగారని హుమా ఖురేషి చాట్ సమయంలో ప్రశ్నించగా.. ఆయుర్వేద కారణాల వల్ల ఇది తనకు సమస్య కాదని అక్షయ్ కుమార్ తెలిపారు. 
 
ప్రత్యేకమైన టీ తాగాల్సిందిగా అక్షయ్‌ను ఎలా ఒప్పించారని హుమా ఖురేషీ... బేర్ గ్రిల్స్‌ను అడిగినప్పుడు.. "మేము ఆ పని ఎలా చేశామో నాకే తెలియదు కాని అది చాలా చెడ్డదిగా ఉంది" అని చెప్పారు. గ్రిల్స్‌కు అక్షయ్ సమాధానమిస్తూ, "నేను ఆందోళన చెందలేదు. ఆయుర్వేద కారణాల వల్ల నేను ప్రతి రోజు ఆవు మూత్రాన్ని తీసుకుంటున్నాను" అని చెప్పేసరికి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. 
 
అక్షయ్ కుమార్‌తో తన అనుభవం గురించి అడగ్గా.. ఎంతో ప్రశాంతంగా ఉంటారని, ఎలాంటి అహం లేదని, వినయంగా ఉండే వ్యక్తి అని బేర్ గ్రిల్స్ ఆకాశానికెత్తాడు. తనవి సురక్షితమైన చేతులైనందునే రిలాక్స్ అయ్యానని అక్షయ్ కుమార్ చెప్పాడు. 
 
బేర్ గ్రిల్స్ ప్లేస్‌లో మీరు ఉన్నట్లయితే అతడితో ఏ స్టంట్స్ చేయించేవారని చాట్‌లో ఓ అభిమాని అడగ్గా.. విమానం నుంచి దూకమని, ఆవు మూత్రంతో చేసిన టీ తాగమని, తిమింగలాలతో సముద్రంలో ఈతకొట్టమని పురమాయించేవాడినని అక్షయ్ కుమార్ సరదాగా చెప్పడం నవ్వుల్లో ముంచెత్తింది.
 
కాగా, ఇంటూ ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ కార్యక్రమం ఈ నెల 11వ తేదీన రాత్రి 8 గంటలకు డిస్కవరీ ప్లస్ యాప్‌లో, సెప్టెంబర్ 14న రాత్రి 8 గంటలకు డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారంకానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు