అర్థగంట కూర్చొని చర్చించుకుంటే పరిష్కారమయ్యే సమస్య : దాసరి అరుణ్ కుమార్

ఆదివారం, 28 జూన్ 2020 (16:42 IST)
దర్శకరత్న దివంగత దాసరి నారాయణ రావు ఆస్తి వ్యవహారం ఇపుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు కుమారులతో పాటు.. కుమార్తె ఈ ఆస్తి పంపకాల విషయంలో గొడవపడుతున్నారు. పెద్ద కుమారుడు ఏకంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అర్థరాత్రి తమ ఇంట్లోకి ప్రవేశించి బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ తమ్ముడు అరుణ్‌పై ఆయన సోదరుడు ప్రభు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఈ వ్యవహారంపై దాసరి చిన్న కుమారుడు, హీరో అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అరగంట కూర్చొని చర్చించుకుంటే పరిష్కారమయ్యే సమస్య మాది అని తేల్చిపారేశారు. మా ఇల్లు ముగ్గురికీ చెందినది.. ఏ ఒక్కరిదీ కాదు. అన్నయ్యకు ఏమైనా సమస్యలుంటే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. న్యాయ పోరాటం చేయొచ్చు. అందుకు నేను కూడా సిద్ధంగా ఉన్నాను. అన్ని అంశాలను వివరించేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు. 
 
మరోవైపు, ఆ ఇంటి విషయంలో మా అన్నయ్య దగ్గర కోర్టు ఉత్తర్వు ఏమైనా ఉందా? ఆస్తికి సంబంధించిన వీలునామా ఉంటే చూపించాలి. మా అన్నయ్య, సోదరితో నాకు ఎలాంటి వివాదం లేదు. నాపై కేసు పెట్టారు. చేయి చేసుకున్నానని అన్నారు. నేను లేడీస్‌పై చేయి చేసుకోవడం ఏంటీ? అవన్నీ అబద్ధాలు. అరగంట కూర్చొని చర్చించుకుంటే పరిష్కారమయ్యే సమస్య మాది అని అరుణ్ వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, తమ మధ్య చెలరేగిన ఆస్తి వివాదంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారని, వారి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నంలో ఉన్నారంటూ వచ్చిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా దాసరి అరుణ్ ఖండించారు. 'చిరంజీవి గారి పేరు ఇందులో ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. అనవసరంగా ఆయన పేరును ఇందులోకి లాగుతున్నారు. ఈ విషయానికి, ఆయనకు ఎలాంటి సంబంధం లేదు' అని అరుణ్ క్లారిటీ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు