తాజాగా ఈ సక్సెస్ఫుల్ బ్యానర్ నుంచి దర్శకుడు సుకుమార్ నిర్మించిన 'కుమార్ 21 ఎఫ్'తో బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్న హెబ్బా పటేల్ కథానాయికగా లక్కీమీడియా బ్యానర్‌పై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్`. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ పోస్టర్‌ను, ఓ సాంగ్‌ను రేడియో మిర్చిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత బెక్కం వేణుగోపాల్(గోపి), దర్శకుడు భాస్కర్ బండి, అశ్విన్ బాబు, పార్వతీశం, నోయెల్ సేన్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ 'నాన్న, నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సినిమా కథ కోసం దాదాపు యేడాదిగా కసరత్తులు చేశాం. ఇది యూత్‌ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా ద్వారా ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు భాస్కర్ బండి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. ఈ కథను ముందు ప్రముఖ నిర్మాత దిల్ రాజుగారికి వినిపించాం. ఆయన కథ విని కొన్ని మార్పులు చేయమని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే కథలో మార్పులు చేసి సినిమా తీశాం. ఫస్ట్ కాపీ చూసి దిల్ రాజు సినిమా చాలా బావుందని అభినందించారు.
గతంలో మా బ్యానర్లో వచ్చిన `సినిమా చూపిస్త మావ` సినిమా చూసిన రాజు సినిమా నచ్చడంతో నైజాం హక్కులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు `నాన్న, నేను నా బాయ్‌ఫ్రెండ్స్` సినిమా చూసి బాగా నచ్చడంతో సినిమాకు సంబంధించిన మొత్తం హక్కులను మంచి ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇలా రాజు కంటెంట్‌పై నమ్మకంతో విడుదల చేసిన హ్యాపీడేస్, పటాస్ వంటి చిత్రాలు ఘన విజయాలను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాన్న, నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సినిమా విషయంలో అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. త్వరలోనే ఆడియో, సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పుకొచ్చారు.