బాహుబలి స్క్రిప్టును మొత్తంగా నాన్న సత్యరాజ్ ఇంట్లో చెప్పేశారని కానీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయాన్ని మాత్రం ఆయన తమకు చెప్పనే లేదని ప్రముఖ తమిళ నటుడు, కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ కుమార్తె దివ్య పేర్కొంది. గత రెండేళ్లుగా యావత్ ప్రపంచాన్ని ఊగించిన, ఉర్రూలతూగించిన ప్రశ్నగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు కోట్లాది మంది జనం నోళ్లలో నానుతూ వచ్చింది. కాని బాహుబలి మొత్తం స్క్రిప్టు తమతో పంచుకున్న నాన్న ఆ ఒక్క ప్రశ్నకు సమాధానాన్ని మాత్రం చెప్పలేదని దివ్య తెలిపింది.
సినిమాలో అందరినీ వేధించిన ప్రశ్న గురించి.. సన్నిహితులు తనను గుచ్చి..గుచ్చి అడిగేవారని, అయితే.. బాహుబలి-2 విడుదలయ్యేంత వరకూ దానికి సమాధానం తనకు కూడా తెలియదని దివ్య చెప్పింది. తన తండ్రి కట్టప్ప ఆ ప్రశ్నకు జవాబును అంత గోప్యంగా ఉంచారని తెలిపింది. ఆయన తమ వద్ద ఉన్నప్పుడు రకరకాల సమాధానాలు చెప్పి సతాయించేవాళ్లమని తెలిపింది.
కానీ ఆ టాపిక్ వచ్చినప్పుడల్లా ఆయన ఓ చిన్న నవ్వు నవ్వేసి ఊరుకునేవారని, ఇన్నేళ్లలో తమ తండ్రి అత్యంత గోప్యంగా ఉంచిన రహస్యం ఏదైనా ఉందంటే అది.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. అన్నదేనని చెప్పింది సత్యరాజ్ కూతురు దివ్య.