ఢిల్లీలో వ్యవసాయ చట్టంపై రైతులు పోరాటం చేస్తూ బంద్ వరకు తీసుకురావడంపై ఫిలింఛాంబర్ ప్రెసిడెంట్, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ప్రశంసించారు. రైతు పోరాటం గురించి అడిగి ప్రశ్నకు.. ఆయన ఈ విధంగా స్పందించారు. రైతులేనిదే రాజ్యం లేదని ఎన్నో ఏళ్ళుగా చెబుతున్నాం. మనం సినిమాలు తీస్తున్నాం. అయితే రైతుకు సమస్య వస్తే తెలుగు పరిశ్రమ ముందుకు రావడం లేదని అంటున్నారు.
నిజమే... మన దగ్గర ఆ ఐక్యత లేదు. ఒకవేళ మద్దతుగా వెళదాం అంటే.. ఏదో ఆశించి చేస్తున్నాడని రాళ్ళు వేస్తారు. నా దృష్టిలో రైతే రాజు. ఉత్తరాదిలో రైతు ఉద్యమం బలంగా వుండడానికి కారణం.. వారంతా నిజమైన ఫైటర్లు. మనం డూప్ పైటర్లం. ఖచ్చితంగా రైతు సమస్యలపై స్పందించారు. నేను దీనిపై ఓ సినిమా చేయబోతున్నా. త్వరలో వెల్లడిస్తా.
నా దృష్టిలో ఏ భ్రదత, భరోసా లేని వాడు రైతు. ఎండ, వాన, చలి అని చూడకుండా పంటకోసం పరితపించేవాడు రైతు. దాన్ని కొందరు మధ్యవర్తులు తీసుకుని లాభపడుతున్నారు. ఈ విధానం పోవాలి. రైతుకు ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వవు. కానీ పెద్ద పెద్ద తిమింగలాలకు ఎన్నో రాయితీలు కల్పిస్తున్నారు. రైతు డబ్బు సరిగ్గా కట్టకపోతే పాస్‌బుక్ లాగేసుకుంటారు. కానీ పెద్ద పెద్ద బిజినెస్ చేసేవారిని ఏమీ చేయలేరు.
అందుకే ఈ విధానం పోవాలి. మన రాజ్యాంగమే మార్చాలి. ఎన్ని నెలల నుంచి రైతులు పోరాటం చేస్తుంటే ఇప్పటికి వెలుగులోకి వచ్చారు. వారు నిరంతరం పోరాడుతూనే వున్నారు. ఉత్తరాదిలోని పంజాబ్ రైతులు వారి పిల్లలు కూడా రోడ్డు మీద కూర్చుని చదువుతున్నారు. వారికి వ్యవసాయం మీద వున్న ప్రేమ కన్సిస్తుంది. నేను రైతులకు అండగా వుంటాను. పరిశ్రమ కూడా అండగా వుండాలి అని కోరారు.