భారత్ బంద్: వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసన ఎందుకు? వారి డిమాండ్లు ఏమిటి?

మంగళవారం, 8 డిశెంబరు 2020 (14:21 IST)
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరులో అమలులోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల వద్ద పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రైతులు నవంబరు 26 నుంచి నిరసనలు చేపడుతున్నారు. ఛలో దిల్లీ పేరుతో నవంబరు26న దిల్లీకి బయలుదేరిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. రైతులపై వాటర్ క్యానన్లను, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పెద్దఎత్తున బ్యారికేడ్లు, బండరాళ్లను రోడ్లపై అడ్డంగా పెట్టి రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా, రైతులు వెనకడుగు వేయలేదు, పోలీసులు అడ్డుకున్న చోటే ఆందోళన కొనసాగిస్తున్నారు. అక్కడే వంటా వార్పు చేపట్టారు. రోజూ సమావేశమవుతూ భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చిస్తున్నారు.

 
డిసెంబరు 08న రైతు సంఘాలు దేశ వ్యాప్త బందుకు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్, ఆప్, ఎన్సీపీ, టీఆర్ఎస్‌తో సహా 10కి పైగా ప్రతిపక్ష పార్టీలు రైతులకు మద్దతు పలికాయి. మరో వైపు రైతు సంఘాల నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. డిసెంబరు 9న మరో విడత చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల నిరసనలకు కారణాలేమిటి? ప్రభుత్వం ఏమంటోంది? డిసెంబరు 8న ఏం జరగబోతోంది? తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

 
రైతుల డిమాండ్లు ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన వ్యవసాయ సంస్కరణ చట్టాలు మూడింటిని రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి పంటల కొనుగోలును ప్రభుత్వం కొనసాగించాలని అఖిల భారతీయ కిసాన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి కోరుతోంది. తమ ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటని చెబుతోంది.

 
కొత్తగా అమలు చేసిన చట్టాలు ఏమిటి?
1) నిత్యవసర సరకుల(సవరణ) చట్టం (ది ఎసెన్షియల్ కమోడిటీస్(అమెండమెంట్) యాక్ట్ 2020). దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిత్యవసర సరకుల చట్టం- 1955కి కొన్ని సవరణలు చేస్తూ దీన్ని తీసుకొచ్చారు.
 
2) 'రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) చట్టం' (ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్, ఫెసిలిటేషన్) యాక్ట్)
 
3) 'రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020(ది ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ - 2020).

 
ఈ చట్టాలలో ఏముంది?
నిత్యవసర సరకుల(సవరణ) చట్టం (ది ఎసెన్షియల్ కమోడిటీస్(అమెండమెంట్) యాక్ట్ 2020). దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిత్యవసర సరకుల చట్టం - 1955కి కొన్ని సవరణలతో దీన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా నిత్యవసర సరకుల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యం తదితర కార్యకలాపాల నియంత్రణాధికారం కేంద్రానికి ఉంటుంది. వ్యవసాయ రంగంలో పోటీ, రైతుల ఆదాయం పెంచడానికి ఉద్దేశించిన చట్టంగా ఆర్డినెన్సులో పేర్కొన్నారు.

 
ఆహార ఉత్పత్తులపై నియంత్రణ: కొన్ని రకాల ఆహార పదార్థాలు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు వంటివి నిత్యవసరాలుగా పేర్కొనడానికి ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. యుద్ధం, కరవు, ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ప్రకృతి విపత్తులు వంటి అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు తృణధాన్యాలు, పప్పులు, బంగాళా దుంపలు, ఉల్లి, నూనె గింజలు, నూనెలు వంటి ఆహారవస్తువులలో వేటి సరఫరానైనా నియంత్రించే అధికారాన్ని కేంద్రానికి ఇస్తుందీ చట్టం.

 
నిల్వ: ఏదైనా నిత్యవసర వస్తువును ఒక వ్యక్తి ఎంత పరిమాణంలో నిల్వ చేసుకోవచ్చనే నియంత్రణ విధించే అధికారమూ కేంద్రానికి కల్పిస్తుందీ చట్టం. దీనికి ధరల పెరుగుదలను ప్రాతిపదికగా తీసుకుంటారు. దీనికి అయిదేళ్ల సగటు ధరతో కానీ, లేదంటే ఏడాది కిందట ధరతో కానీ పోల్చి పెరుగుదల స్థాయిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యాన ఉత్పత్తులైతే 100 శాతం ధర పెరిగిన పక్షంలో నిల్వపై నియంత్రణ విధించే అవకాశం ఉంటుంది. త్వరగా పాడవని వ్యవసాయ ఉత్పత్తులకైతే 50 శాతం ధర పెరిగితే నిల్వపై నియంత్రణ విధించే అవకాశం ఉంటుంది.

 
అయితే, ఆయా వ్యవసాయ వస్తువుల వేల్యూ చైన్ భాగస్వాములకు ఈ నిల్వ పరిమితి వర్తించదు. అంటే పంట పండించేవారి నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, గోదాం, రవాణా, పంపిణీదారు వరకు ఎవరికీ వర్తించదు. ఈ నియంత్రణలు, నిల్వ పరిమితులు ప్రజాపంపిణీ వ్యవస్థకు వర్తించవు.

 
2) 'రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) చట్టం'
వ్యవసాయ మార్కెట్లను నియంత్రించే మార్కెట్ కమిటీలతో సంబంధం లేకుండా దేశంలో వేర్వేరు రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లోని జిల్లాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఇది అవకాశం కల్పిస్తుంది. మార్కెట్ కమిటీల సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఎలాంటి పన్నులు వేయడానికి, ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు.

 
ఎలక్ట్రానిక్ ట్రేడింగ్: నిర్దేశిత వాణిజ్య ప్రాంతంలో రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్ కమిటీల నియంత్రణలోకి వచ్చే ఉత్పత్తుల ఎలక్ట్రానిక్ వర్తకానికి(ఈ-వర్తకం) ఇది అనుమతిస్తుంది. ఆన్‌లైన్ క్రయవిక్రయాల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వేదికను ఏర్పాటు చేయొచ్చు. పాన్ కార్డు ఉన్న కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, రిజిస్టర్డ్ సొసైటీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు, వ్యవసాయ సహకార సంస్థలు ఏవైనా ఇలాంటి ఆన్‌లైన్ వర్తక వేదికను ఏర్పాటు చేయొచ్చు.

 
3) 'రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020
 
కాంట్రాక్ట్ ఫార్మింగ్: ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించైనా పంట వేయడానికి ముందే రైతు, కొనుగోలుదారు ఒప్పందం కుదుర్చుకునే వీలు కల్పిస్తుందీ చట్టం. ఈ ఒప్పందాలు కనిష్ఠంగా ఒక పంటకాలం నుంచి అయిదేళ్ల వరకు చేసుకోవచ్చు.

 
వ్యవసాయ ఉత్పత్తుల ధర: ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరను పేర్కొనాలి. ధర నిర్ణయ ప్రక్రియను ఒప్పందంలో రాయాలి. మూడంచెల వివాద పరిష్కార విధానం: ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్‌లో తలెత్తే సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ సయోధ్య(కన్సిలియేషన్) బోర్డ్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, అప్పీలేట్ అథారిటీ ఉంటాయి.

 
ఏదైనా వివాదం తలెత్తితే.. మొదట బోర్డు పరిధిలో సయోధ్యకు ప్రయత్నిస్తారు. అక్కడ పరిష్కారం కాకుంటే 30 రోజుల తరువాత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌ను సంప్రదించొచ్చు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలేట్ అథారిటీని సంప్రదించొచ్చు. అప్పీలేట్ అథారిటీగా ఐఏఎస్‌ స్థాయి అధికారులు ఉంటారు. ఏ స్థాయిలోనైనా రైతుకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే రికవరీ కోసం వ్యవసాయ భూమిని తీసుకోవడానికి ఈ చట్టం అంగీకరించదు. కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) చట్టంలో చేర్చాలని, ప్రభుత్వం మండీల (మార్కెట్లు) నుంచి కొనుగోళ్లను కొనసాగించాలని ప్రస్తుత చర్చల్లో రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

 
ఎంఎస్‌పీ అంటే ఏమిటి?
మార్కెట్‌లో పంటల ధరలు పడిపోయినా, రైతులకు నష్టం కలగకుండా వాటికి ఓ కనీస మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ ధరకు పంటలను రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఏ పంటకైనా దేశవ్యాప్తంగా ఒకే ఎంఎస్‌పీ ఉంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖలోని కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రొడ్యూసేస్ సిఫార్సులకు అనుగుణంగా ఎంఎస్‌పీ నిర్ణయిస్తారు. ప్రస్తుతం 23 పంటలకు ఎంఎస్‌పీని నిర్ణయిస్తున్నారు. వరి, గోధుమలు, జొన్న, చిరుధాన్యాలు, మొక్కజొన్న, పెసర్లు, వేరుశెనగ, సోయాబీన్, నువ్వులు, పత్తి వంటి పంటలు వీటిలో ఉన్నాయి.

 
ఉత్తరాది రాష్ట్రాల నుంచే నిరసనలు ఎందుకు?
దేశంలో ఆరు శాతం రైతులకు మాత్రమే ఎంఎస్‌పీ అందుతోందని, వీరిలో ఎక్కువ మంది పంజాబ్, హరియాణా రాష్ట్రాల వారేనని అంచనాలు ఉన్నాయి. అందుకే, కొత్త వ్యవసాయ చట్టాలపై ఈ రాష్ట్రాల నుంచే ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎంఎస్‌పీకి పంటలను కొనుగోలు చేస్తామని ఇప్పటివరకూ ప్రభుత్వం రాతపూర్వకంగా ఆదేశాలు ఇవ్వలేదని, మౌఖికంగానే చెబుతోందని కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ అన్నారు. అందుకే కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చిన తర్వాత రైతుల్లో ఆందోళనలు పెరిగాయని చెప్పారు. ఎంఎస్‌పీకి పంటల కొనుగోళ్లు కొనసాగిస్తామని కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది.

 
‘‘నేను ఇదివరకే చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. ఎంఎస్‌పీ వ్యవస్థ, ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడం కొనసాగుతుంది. మేం రైతులకు సేవ చేసేందుకే ఉన్నాం. అన్నదాతలను ఆదుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. వారి కుటుంబాల్లో భావి తరాల జీవితాలు కూడా మెరుగ్గా ఉండేందుకు కృషి చేస్తాం’’ అని సెప్టెంబర్ 20న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కానీ, ఎంఎస్‌పీని, పంటల కొనుగోలును కొనసాగిస్తామని చట్టంలో పొందుపరిచేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇదివరకు కూడా చట్టాల్లో రాతపూర్వకంగా ఈ విషయం ఎక్కడా లేదని, అందుకే కొత్త చట్టాల్లోనూ పేర్కొనలేదని ప్రభుత్వం అంటోంది.

 
మరోవైపు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధిని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వకపోవడం కూడా రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఇదివరకు ఈ నిధి నుంచి ఏటా మూడు శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇచ్చేది. కానీ, ఈ ఏడాది అందుకు నిరాకరించింది.

 
ప్రస్తుతం రైతులు ఏమంటున్నారు?
‘‘ఈ చట్టాల వల్ల రైతులకు జరిగే మేలు ఏమాత్రం ఉండదు. కార్పొరేట్ సంస్థలకే ఇవి మేలు చేస్తాయి' అని రైతులు అంటున్నారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఈ చట్టం అవకాశం ఇస్తున్నా.. ఎంత మంది రైతులు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి విక్రయించగలరని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు కన్నెగంటి రవి కుమార్ ప్రశ్నించారు.

 
కేవలం కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలు.. వాటి ఏజెంట్లు రైతుల నుంచి కొనుగోలు చేసి ఆ తరువాత రాష్ట్రాలు దాటిస్తూ వ్యాపారం చేసుకుంటాయని చెబుతూ.. ఇప్పటికే నూనెగింజలు, నూనెలు, పప్పుధాన్యాలు వంటి ఉత్పత్తులు కార్పొరేట్ల గుత్తాధిపత్యంలో ఉన్నాయని.. ఇకపై దేశంలోని అన్ని వ్యవసాయ ఉత్పత్తులకీ అదే గతి పడుతుందని ఆయన అన్నారు.

 
''ఇంతవరకు వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ రాష్ట్రాల పరిధిలో ఉండేది. వరదలు, తుపాన్లు వచ్చినప్పుడు.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు దిగుబడులు తగ్గి సొంత అవసరాలకే పంట ఉత్పత్తులు చాలని పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ఉత్పత్తులు తమ సరిహద్దులు దాటకుండా నియంత్రణ విధించే వెసులుబాటు ఉండేది. కొత్త చట్టాలలో ఆ అవకాశం లేదు. దేశమంతటా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అలాంటప్పుడు రాష్ట్రాలు తమ సొంత ప్రయోజనాలు కాపాడుకోలేని స్థితికి చేరుకుంటాయి'' అంటూ ఇందులోని లోటుపాట్లను ఆయన విశ్లేషించారు.

 
''ఆహార ధాన్యాల సేకరణ ఎక్కువగా నమోదయ్యే పంజాబ్, హరియాణాల్లో రైతులు ప్రస్తుతం చేపడుతున్న ఆందోళనల వెనుక రాజకీయ పార్టీలు ఉంటున్నాయి. కనీస మద్దతు ధర ఉండదని, ప్రొక్యూర్‌మెంట్ ఆగిపోతుందని చెబుతూ రైతులను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు. కానీ, ఈ మూడు చట్టాల్లో రైతుకు నష్టం చేసేది ఒక్కటి కూడా లేదు. పూర్తి ప్రయోజనం అందించలేకపోయినా గతంతో పోల్చితే ఈ మూడు చట్టాలు రైతులకు ఎంతోకొంత మేలు చేసేవే'' అని ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ జనరల్ సెక్రటరీ, విశ్రాంత ఐఏఎస్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు.

 
ప్రభుత్వం ఏమంటోంది?
కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనకరమైనవని, రైతులను కొందరు రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని ప్రధాని మోదీ పదే పదే అంటున్నారు. వ్యవసాయ చట్టాలకు చేసిన సవరణల వల్ల రైతులకు ఉన్న ఎన్నో అడ్డంకులు తొలగుతాయని కొత్త అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పారు. మహారాష్ట్ర ధులే జిల్లాలో జితేంద్ర భోయిజీ అనే రైతు తన మొక్కజొన్న పంటకు తగిన ధర పొందడానికి వ్యవసాయ చట్టాలను ఎలా ఉపయోగించుకున్నారో ప్రధాని తన ‘మన్ కీ బాత్' లో ప్రస్తావించారు..

 
జితేంద్ర తన మొత్తం పంటను అమ్మడానికి సుమారు రూ. 3.32 లక్షల ధర నిర్ణయించుకున్నారు, 25 వేలు అడ్వాన్స్ కూడా తీసుకున్న ఆయన, మిగతా డబ్బులు కూడా 15 రోజుల్లో చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. "ఆ తర్వాత పరిస్థితులు మారాయి. జితేంద్రకు మిగతా డబ్బు అందలేదు. నాలుగు నెలలు వేచిచూసిన ఆయన తర్వాత చట్టాల సాయం తీసుకున్నారు. ఈ చట్టం కింద పంట కొనుగోలు చేసిన మూడు రోజుల్లో రైతులు పేమెంట్ ఇవ్వకపోతే, సదరు రైతు ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఎస్డీఎం ఒక నెల లోపు రైతు ఫిర్యాదును పరిష్కరించాలని ఈ చట్టంలో నిబంధనలు కూడా ఉన్నాయి" అని ప్రధాని తెలిపారు.

 
ఇలాంటి చట్టాలతో సమస్య కచ్చితంగా పరిష్కారం అవుతుందని.. కొన్ని రోజుల్లోనే రైతుకు రావాల్సిన బకాయిలు చెల్లించారని మోదీ చెప్పారు. లోక్‌సభలో ఈ బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలోనే వాటిని వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్ర పక్షం, ఎన్డీయే కూటమిలోని పార్టీ శిరోమణి అకాలీదళ్ నేత, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వంతో ఓవైపు శనివారం, ఆదివారం చర్చలు జరగాల్సి ఉన్నా... రైతులు ముందుగానే డిసెంబర్ 8న భారత్ బంద్ ప్రకటించారు. కాంగ్రెస్, ఆప్, ఎన్సీపీ, టీఆర్ఎస్ తో సహా 10కి పైగా ప్రతిపక్ష పార్టీలు రైతులకు మద్దతు పలికాయి.

 
‘‘భారత్ బంద్ ప్రకటించడం ద్వారా మా వైఖరి ఏంటో ప్రభుత్వానికి స్పష్టం చేశాం. మా డిమాండ్లకు ఒప్పుకోకపోతే, ఆందోళనలు మరింత తీవ్రం అవుతాయి. దిల్లీ చుట్టుూ ఉండే ఏడు సరిహద్దులను పూర్తిగా మూసేస్తాం. ఆందోళనల్లో పాల్గొంటున్న ప్రముఖులంతా సరిహద్దుల్లోనే తిష్ట వేస్తారు’’ అని మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నాయకుడు సందీప్ గిడ్డే అన్నారు. రైతులకు మద్దతుగా దిల్లీలో కొన్ని ఆటో, టాక్సీ డ్రైవర్ల సంఘాలు కూడా తమ సేవలను అందించబోమని ప్రకటించాయి. లండన్‌లో కూడా ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ కూడా రైతులకు మద్దతు తెలిపింది.

 
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ట్విటర్ ద్వారా రైతులకు తన మద్దతు ప్రకటించారు. కమల్ హసన్ పార్టీ 'మక్కళ్ నీది మయ్యమ్' కూడా రైతులకు మద్దతు తెలిపింది. రైతుల డిమాండ్లు చర్చించేందుకు ప్రభుత్వ ప్రతినిధులు, రైతు సంఘాలు డిసెంబరు 09న దిల్లీలో సమావేశం కానున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు