హైదరబాద్‌లోని ఇందిరా నగర్‌లో ఓ ఘటన జరిగింది. కెమెరామెన్‌ను కో-డైరెక్టర్ కత్తితో పొడిచాడు. ఈ ఘటన కలకలం రేపింది. తెలుగు చిత్రపరిశ్రమలో కో-డైరెక్టర్‌గా పని చేస్తున్న రాంరెడ్డి అనే వ్యక్తి, ఓ చానల్‌లో కెమెరామెన్‌గా ఉన్న కృష్ణ భవన్ రాజు అలియాస్ వర్మపై కత్తితో దాడి చేశాడు. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
తూర్పుగోదావరి జిల్లా, ముమ్మడివరం మండలం, అయినపురం గ్రామానికి చెందిన వర్మ ఇందిరానగర్‌లో ఉంటున్నాడు. ఈయనకు రాంరెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే గదిలో అద్దెకు ఉంటున్నారు. అయితే, రాంరెడ్డికి నిద్రలో లేచే అలవాటు ఉంది. అలాగే, తనను ఎవరో చంపడానికి వస్తున్నారంటూ కేకలు వేసేవాడు. అదే విషయాన్ని 100కు డయల్ చేసి ఫిర్యాదు చేసేవాడు. ఆపై పోలీసులు విచారించి, అది అపోహ మాత్రమేనని కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతుండేవారు.
ఈ క్రమంలో రాత్రి ఒంటిగంట సమయంలో వర్మ మేడపై ఉండగా, కూరగాయల కత్తితో రాంరెడ్డి దాడి చేశాడు. అతని కిడ్నీలో, కడుపులో పొడిచాడు. చేతులకు కత్తి గాయాలు చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరిగెత్తి, ఓ ఏటీఎం పక్కన స్పృహతప్పి పడిపోయిన వర్మను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, అతన్ని నిమ్స్ లో చికిత్స నిమిత్తం చేర్చారు. రాంరెడ్డి పరారీలో ఉన్నాడని, కేసు దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.