మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మా నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు రావడంపై మా అధ్యక్షుడు శివాజీరాజా స్పందించింది. దీనిపై మా కార్యవర్గ సమావేశం సోమవారం భేటీ అయ్యింది. ఈ సమావేశానికి ''మా'' అధ్యక్షుడు శివాజీరాజా, కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్ హాజరయ్యారు.
అనంతరం శివాజీ రాజా మాట్లాడుతూ.. ''మా'' నిధులు దుర్వినియోగమయ్యాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అసోసియేషన్‌లో ఐదు పైసలు దుర్వినియోగమైనా తన ఆస్తినంతా రాసిచ్చేస్తానని సవాల్ చేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకారమే డబ్బు వసూలైందని.. నిధులు దుర్వినియోగం చేసినట్లు ఎవరైనా నిరూపిస్తే అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు.
వేడుకల ద్వారా వచ్చే డబ్బులతో మా అసోసియేషన్ నిర్మించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అసోసియేషన్ ఎన్నికలు సమీపిస్తున్నందున ఉద్దేశపూర్వకంగానే తమపై ఆరోపణలు చేస్తున్నారని శివాజీరాజ్ ఆక్షేపించారు. అసోసియేషన్ డబ్బుతో తాను ఒక్క టీ కూడా తాగలేదని ఆయన అన్నారు. తాము చేస్తున్న మంచి పనులను తప్పు పట్టడమే వాళ్ల పనని తెలిపారు.