ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న భారత జట్టులో ఓ సభ్యుడు మహ్మద్ సిరాజ్. హైదరాబాద్కు చెందిన ఈ కుర్రోడు... తండ్రిని కోల్పయిన దుఃఖంలోనూ మైదానంలో అమితంగా రాణించాడు. ఇపుడు ఈ సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశానికి చేరుకున్నాడు. ఈయన తండ్రి ఓ ఆటో డ్రైవర్. అయితే, ఇపుడు మహ్మద్ సిరాజ్ ఏకంగా బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశాడు. ఈ కారును తనకు తానే బహుమతిగా ఇచ్చుకున్నాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టులకు బ్యాకప్ బౌలర్గా ఎంపికైన సిరాజ్.. ఆ దేశంలో ఉండగానే తన తండ్రి మరణ వార్తను విన్నాడు. క్వారంటైన్లో ఉన్న అతడిని స్వదేశానికి వెళ్లేందుకు బీసీసీఐ అనుమతించింది. తాను దేశం తరపున ఆడాలనేది తండ్రి కల అని, దానిని నెరవేర్చిన తర్వాతే ఇంటికి వెళ్తానని బోర్డుకు తేల్చి చెప్పాడు. దానిని నిజం చేస్తూ టెస్టు సిరీస్ను భారత్ గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అందరితో శెభాష్ అనిపించుకుంటున్నాడు.
తొలి టెస్టులో షమి గాయపడడం వల్లే సిరాజ్కు జట్టులో చోటుదక్కింది. ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఇతడు.. మెల్బోర్న్లో 5 వికెట్లు తీసి గెలుపులో సహాయపడ్డాడు. సిడ్నీ మ్యాచ్లో ఆసీస్ ప్రేక్షకుల నుంచి జాత్యాంహకార వ్యాఖ్యలు ఎదుర్కొన్నా సరే వాటిని తట్టుకుని నిలబడి, రెండు వికెట్లు తీశాడు.