అమరావతి: ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డివి కుహనా రాజకీయాలని, 11 కేసుల్లో ఎ1 నిందితుడి ఉన్న ఆయనకు సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవ్వడం వల్లే టీడీపీ ప్రభుత్వం పోరాటబాట పట్టిందన్నారు. మూడున్నరేళ్ల పాటు ఓపిగ్గా ఉన్నామన్నారు. 2018-19 బడ్జెట్లోనూ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాల ఆధారంగా ఎటువంటి నిధులు కేటాయించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభాలకు ఎటువంటి గౌరవమూ లభించకపోవడంతో కేంద్ర మంత్రి పదవులకు తెలుగుదేశం పార్టీ సభ్యులు రాజీనామా చేశారన్నారు.
ఏపీ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబునాయుడు ఎంతో త్యాగం చేస్తే, కొనియాడాల్సిందిపోయి, ఆయనపై జగన్ లేనిపోని అభాండాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అని పేర్కొనడం జగన్ రాజకీయ అపరిపకత్వాన్ని తెలియజేస్తోందన్నారు. ఏపీ హక్కుల సాధనలోనూ, రాష్ట్ర ప్రయోజనాల లక్ష్య ఛేదనలోనూ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజీపడలేదని మంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లోనూ సీఎం చంద్రబాబునాయుడు గతంలో క్రీయాశీలకంగా పనిచేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుల్లో మొదటి రెండు స్థానాల్లో చంద్రబాబునాయుడు ఉంటారన్నారు. యునైటెడ్ ప్రభుత్వం, ఎన్డీఏ 1 ప్రభుత్వ హయాల్లో, ముఖ్యంగా మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయితో కలిసి దేశ సమగ్రతకు చంద్రబాబునాయుడు చేసిన కృషిని దేశ ప్రజలెవ్వరూ మరువలేదన్నారు. మచ్చలేని రాజకీయ జీవితం గడిపిన చంద్రబాబునాయుడుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, నోటికిచ్చినట్లు మాట్లాడుతున్న జగన్‌ను ప్రజలు ఎప్పుడూ క్షమించరన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎంపిగా ఉన్న జగన్ తీరును రాష్ట్ర ప్రజలెవ్వరూ ఇంకా మరిచిలేపోలేదని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు.
జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై, సోనియాగాంధీ ఆశీస్సులతో బెయిల్ తెచ్చుకున్న విషయం జగన్‌కు గుర్తు లేదా? అని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలతో చేయి కలిపి టీడీపీని బలహీనపర్చాలని కుట్రలు చేయడం వాస్తవం కాదా? అని నిలదీశారు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని, వేల కోట్ల రూపాయలు దోచుకున్న జగన్... చంద్రబాబునాయుడుపై లేనిపోని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నిసార్లు మాట తప్పావో... ఎన్ని పర్యాయాలు మడమ తిప్పావో... ఇంకెన్నిసార్లు బాధ్యతల నుంచి పారిపోయావో...? గుర్తులేదా అని జగన్‌ను మంత్రి కాలవ శ్రీనువాసులు ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా కోసం తమ ఎంపిలు రాజీనామా చేస్తారంటూ ఏడాదిన్నర నుంచి డెడ్లైన్లు పెట్టుకుంటూ వస్తున్న విషయాన్ని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం కుదరదని, ఇందుకు సాక్ష్యాధారాలు కావాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలని అన్నారు. ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని జగన్‌ను హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రమంత్రిగా ఉన్నాసరే సుజనా చౌదరి... రాజ్యసభలో మాట్లాడితే, రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. ఇదేనా ప్రతిపక్ష నేతలకు రాష్ట్ర ప్రయోజనాలపై ఉన్న ప్రేమా? అని మంత్రి నిలదీశారు. ఏపీ హక్కుల కోసం లోక్ సభ, రాజ్యసభను టీడీపీ సభ్యులు స్తంభింపజేస్తుంటే, విజయసాయిరెడ్డి మాత్రం దాక్కున్నారన్నారు. జగన్, ఆయన పార్టీ నేతలు లాలూచీ, తెరచాటు రాజకీయాలు చేస్తున్నారన్నారు.