గొడ్డలి వేటు గాయాలను పువ్వులతో కవర్ చేయాలని చూశారు : నాటి సీఐ శంకరయ్య

బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (09:49 IST)
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అపుడు పులివెందుల పట్టణ సర్కిల్ ఇన్‌‍స్పెక్టరుగా ఉన్న శంకరయ్య దర్యాప్తు సంస్థ సీబీఐకు ఇచ్చిన వాంగ్మాలం బయటకు లీకైంది. ఇందులోని అంశాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వివేకానంద రెడ్డి శరీరంపై ఉన్న గొడ్డలివేటు గాయాలని పువ్వులతో కవర్ చేయాలని చూశారని సీఐ శంకరయ్య తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఆ తర్వాత న్యాయవాది ఓబుల్ రెడ్డి వచ్చి మాట్లాడాకే సాక్ష్యాలను ధ్వంసం చేశారని వెల్లడించారు. 
 
హత్య జరిగినట్టు అవినాశ్ రెడ్డి నుంచి తనకు సమాచారం వచ్చిందని, ఆ వెంటనే తాను అక్కడకు చేరుకున్నట్టు చెప్పారు. అప్పటికే కొందరు వ్యక్తులు ఫ్రీజర్ బాక్సును తీసుకొచ్చి మృతదేహాన్ని అందులో పెట్టేందుకు ప్రయత్నిస్తే తాను తిప్పి పంపానని వెల్లడించారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఫ్రీజర్ బాక్సులో పెట్టాలని చెప్పానని వెల్లడించారు. 
 
అంతకుముందు తనకు అవినాష్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చిందని, వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని, ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న జనాలను నియంత్రించేందుకు పోలీసులను పంపాలని చెప్పారని తెలిపారు. దీంతో ముగ్గురు కానిస్టేబుళ్లతో కలిసి తాను కూడా ఘటనా స్థలానికి చేరుకున్నట్టు చెప్పారు. అయితే, అక్కడకు వెళ్లాక వివేకా ఇంట్లోకి కానిస్టేబుళ్లు వెళ్లకుండా శివశంకర్ రెడ్డి అడ్డుకున్నారని, తనను మాత్రమే లోనికి పంపారని పేర్కొన్నారు. 
 
వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలే తొలుత ప్రచారం ప్రారంభించారని శంకరయ్య తన వాంగ్మూలంలో వెల్లడించారు. అలాగే వివేకా హత్య కేసులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర కూడా అనుమానాస్పదంగా ఉన్నట్టు తన దర్యాప్తులో వెల్లడైందని పులివెందుల డీఎస్పీగా పని చేసిన రెడ్డివారి వాసుదేవన్ సీబీఐకు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు