సాధారణంగా మంత్రి పదవులు అలంకరించగానే ప్రతి రాజకీయ నేత ఫుల్ బిజీ అయిపోతారు. కానీ, ఆయన మాత్రం ప్రతి రోజూ జర్నీకే ఏకంగా ఆరు గంటల సమయాన్ని కేటాయిస్తున్నారు. పైగా, ఆయన ప్రయాణం చేసేది ప్రజా సంక్షేమం కాదు.. తన కోసం, తన కుటుంబక్షేమం కోసమట. ఆయన ఎవరో కాదు.. కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి అన్న హెచ్.డి. రేవణ్ణ.
ఈయన కుమార స్వామి మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖామంత్రిగా పని చేస్తున్నారు. నివాసం మాత్రం 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే హొలెనరసిపుర అనే ప్రాంతం. ఇక్కడకు ప్రతి రోజూ వస్తూపోతుంటారు. పోవడానికి మూడు గంటలు, రావడానికి మూడు గంటలు.. అంటే మొత్తం రోజుకు ఆరు గంటలు మంత్రి ప్రయాణానికే పోతున్నది.
దీంతో రేవణ్ణ ప్రజలకు అందుబాటులోకి లేకపోవడంతో ఇటీవల ఓ నేషనల్ మీడియా ఓ జేడీఎస్ నేతను ప్రశ్నించగా.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారట. బెంగళూరులో రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అని ఓ జ్యోతిష్కుడు చెప్పాడట. రేవణ్న బెంగళూరులో ఉంటే ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పడంతో ఆయనిలా రోజూ 340 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు.
ఈ విశ్వాసంతోనే ఆయనిలా రోజూ తన సొంతూరుకు వెళ్లి వస్తున్నట్లు జేడీఎస్ వర్గాలు కూడా చెప్పడం గమనార్హం. రేవణ్ణ బెంగళూరులో ఉంటే ప్రభుత్వం కూలిపోతుందని ఓ జ్యోతిష్యుడు చెప్పాడని.. అప్పటి నుంచి ఆయన దీనిని ఖచ్చితంగా ఫాలో అవుతున్నారని.. జ్యోతిష్యాన్ని నమ్మడం, నమ్మకపోవడం వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది అని జేడీఎస్ నేత చెప్పారు.
అయితే రేవణ్ణ మాత్రం దీనిని ఖండించారు. బెంగళూరులో తనకు ఇంకా ఇల్లు కేటాయించలేదని, అందుకే తాను రోజూ సొంతూరుకి వెళ్లి వస్తున్నట్లు చెప్పడం కొసమెరుపు. మంత్రి రేవణ్ణ కర్ణాటక సీఎం కుమారస్వామి స్వయానా సోదరుడు కావడంతో.. మూఢనమ్మకాలపై ఆయనకున్న విశ్వాసంపై ఆ రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.