ఉత్తర కర్ణాటక రాష్ట్రంలోని 13 జిల్లాలను కలుపుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ సాగుతున్న ఉద్యమంపై కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి స్పందించారు. ప్రత్యేక రాష్ట్రం అగ్నికి ఆజ్యం పోయటానికి బదులుగా ఆత్మసాక్షి ప్రకారం మాధ్యమాలు విధుల్ని నిర్వర్తించాలని హితవు పలికారు. ప్రత్యేక రాష్ట్ర చిచ్చును ప్రసారమాధ్యమాలే రగిలిస్తున్నాయని మండిపడ్డారు.
భాజపా ఎమ్మెల్యే శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడారు. చెన్నపట్టణలో జరిగిన ఒక కార్యక్రమంలో దీన్ని ప్రస్తావించాను. ప్రత్యేక రాష్ట్రమైతే అభివృద్ధికి ఎక్కడి నుంచి ధనాన్ని తేవాలి? అని ప్రశ్నించాం. ఇది పెద్ద నేరమా? దీన్నే మాధ్యమాలు పదే పదే ప్రసారం చేసి.. జనాన్ని రెచ్చగొడుతున్నాయి అంటూ విమర్శించారు.
మాధ్యమాలు ప్రజా ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నాయా అని ప్రశ్నించి నిర్మాణాత్మకంగా విధుల్ని నిర్వర్తించాలని సలహా ఇచ్చారు. రూ.2.18 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఐదు జిల్లాలకు రూ.516 కోట్లు కేటాయించటం తప్పా? ఇకనైనా మాధ్యమాలు ప్రశ్నించుకోవాలని కోరారు. బెంగళూరు నగర అభివృద్ధిని ప్రభుత్వం అటకెక్కిస్తోందని మాధ్యమాలు చేస్తున్న ప్రచారం రాష్ట్రం బాగుకు ఉద్దేశించిందా? లేక వినాశనాన్ని ఆశించిందా? అని కుమార స్వామి విరుచుకుపడ్డారు.