రఘురామకు కేంద్రంలో బాగా వెయిట్ వున్నదా? జగన్ సర్కార్‌కు ఝలక్
బుధవారం, 4 ఆగస్టు 2021 (10:56 IST)
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ కోరుతుంటే, అది చేయకపోగా, రఘురామ ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సర్కారుకు ఝలక్ ఇచ్చింది కేంద్రం. దీనిని బట్టి రఘురామకు కేంద్రం ఇంకా వెయిట్ ఇస్తూనే ఉందని తెలుస్తోంది. ఎంపీ రఘురామకృష్ణం రాజు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం జగన్ సర్కార్‌ను వివరణ కోరింది.
ఏపీ ఎస్డీసీ పేరుతో రుణాలు తీసుకుంటూ, వాటిని సంక్షేమ పథకాలకు వాడుకోవడం, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల్ని, భవిష్యత్ ఆదాయాల్ని తాకట్టు పెట్టడాన్ని తప్పుపడుతూ కేంద్ర ఆర్ధిక శాఖలోని వ్యయ విభాగం పంపిన లేఖ ఇప్పుడు ప్రభుత్వంలో కలకలం రేపుతోంది.
ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ పేరుతో ఓ సంస్ధను ఏర్పాటు చేసి దాని ద్వారా వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున రుణాలు సేకరిస్తోందని, ఇందుకు ప్రభుత్వ ఆస్తుల్ని, భవిష్యత్ ఆదాయాన్ని తనఖా పెడుతుందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని మోడీకి, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కూ వేర్వేరు లేఖలు రాశారు.
రాష్ట్రంలోని కలెక్టరేట్లు, ఎమ్మార్వో ఆఫీసులు, ఇతర ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టి ఏపీఎస్డీసీ ద్వారా రుణాలు తీసుకుంటున్నట్లు రఘురామరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర ఆర్ధికశాఖలోని వ్యయ విభాగం దీనిపై స్పందించింది. ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ ద్వారా రుణ సేకరణ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఏపీ ఆర్ధికశాఖకు రాసిన లేఖలో పేర్కొంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అవసరమైన రుణాల్ని బ్యాంకుల ద్వారా సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని, కేంద్ర ఆర్ధికశాఖ జగన్ సర్కార్‌కు రాసిన లేఖలో తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 (3), ఆర్టికల్ 266 (1)కు విరుద్ధంగా ఈ సంస్ధ ఏర్పాటైనట్లు కేంద్ర ఆర్ధికశాఖ ఏపీ ప్రభుత్వానికి పంపిన లేఖలో తేల్చిచెప్పింది. మద్యం ద్వారా వచ్చే 20 ఏళ్లలో లభించే ఆదాయన్ని. బ్యాంకు రుణాల కోసం జగన్ సర్కార్ గ్యారెంటీగా పెట్టింది. ఈ వ్యవహారాన్ని కేంద్ర ఆర్ధికశాఖ సీరియస్‌గా తీసుకుంది. మద్యంపై ఏపీ ప్రభుత్వం విధిస్తున్న అదనపు సుంకంతో ఏపీఎస్డీసీ బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను తీర్చడంపై ఆర్దికశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఆర్ధిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం రూ.18500 కోట్ల మేర ఇలా రుణాలు తీసుకున్నట్లు ఆర్ధిక శాఖ తెలిపింది. ఈ వ్యవహారంపై కేంద్రం జగన్ సర్కార్ నుంచి ఓ సమగ్ర నివేదిక కోరింది. ఏపీఎస్డీసీ ఏర్పాటుకు పాటించిన నిబంధనలు,దీని ద్వారా ఇప్పటివరకూ తీసుకున్న రుణాలు,వాటికి బ్యాంకులకు సమర్పించిన గ్యారంటీలు, మద్యం ఆదాయంపై ఇచ్చిన హామీ వంటి పలు అంశాల్ని కేంద్ర ఆర్ధికశాఖ కోరినట్లు తెలుస్తోంది. ఈ వివరాలన్నీ కేంద్రానికి ఇస్తే, భవిష్యత్తులో రుణాలపై కచ్చితంగా ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కేంద్రం వద్ద జగన్ సర్కార్‌ను ఇరుకునపెట్టేందుకు రఘురామరాజు వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. ఇప్పుడు కేంద్రం అడిగే వివరాలు ఇచ్చినా సమస్యే, ఇవ్వకున్నా సమస్యే అన్నట్లుగా జగన్ సర్కార్ పరిస్దితి మారనుంది.