కూర్చుని పనిచేసే మహిళలకు క్యాన్సర్ ముప్పు: శారీరక శ్రమ ఉండాల్సిందే!

బుధవారం, 15 జులై 2015 (11:26 IST)
కంప్యూటర్ల పుణ్యమా అని ప్రస్తుతం గంటలు గంటలు వాటిముందు కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. శారీరక శ్రమ లేకపోవడం, తరచూ కంప్యూటర్ల ముందు కూర్చోవడం ద్వారా లెక్కలేనన్ని రోగాలు సులభంగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా గంటల పాటు కూర్చుని పనిచేసే మహిళలకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. 
 
అయితే ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే మహిళల్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సుందని తాజా అధ్యయనంలో తేలింది. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా, ఎక్కువ సేపు కూర్చునే మహిళల్లో క్యాన్సర్ వచ్చే ముప్పు 10 శాతం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం తేల్చింది. 
 
అయితే మగవారిలో మాత్రం ఎక్కువ సేపు కూర్చోవడానికి, క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. 1999 నుంచి 2009 వరకు దాదాపు 69 వేల మంది పురుషులు, 77 వేల మంది స్త్రీలపై కొనసాగిన పరిశోధనల్లో కూర్చుని పనిచేసే మహిళల్లోనే క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నట్లు తెలియవచ్చింది.

ఎక్కువ సేపు కూర్చునే పనిచేసే మహిళల్లో బ్రెస్ట్, ఓవరియన్, బ్లడ్ క్యాన్సర్ సోకే అవకాశం ఉన్నట్లు తేలింది. కాబట్టి మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే... శారీరక శ్రమకు కాస్త ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి