"గాదె" మాటను పట్టించుకోని "ఆది": ఏప్రిల్ 14 ముహూర్తం

WD
తిరుమల తిరుపతి శ్రీవారి ఆనంద నిలయాన్ని స్వర్ణమయం చేసి తీరుతానని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ ఆది కేశవుల నాయుడు పునరుద్ఘాటించారు. స్వయంగా రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి గాదె వెంకటరెడ్డి స్వర్ణ తాపడాల వ్యవహారం కోర్టులో ఉంది కనుక పనులు ప్రస్తుతానికి జరగవని చెప్పినా "ఆది" మాత్రం ఏప్రిల్ 14న స్వర్ణమయానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు.

శ్రీవారి ఆనంద నిలయాన్ని స్వర్ణమయం చేయాలన్న నిర్ణయం వెనుక తన ప్రతిష్ట పెరుగుతుందని కానీ, లేదంటే తితిదే బోర్డు ప్రతిష్ట పెరుగుతుందనే ఉద్దేశాలు లేవని ఆదికేశవులు నాయుడు అన్నారు.

ఇదిలావుంటే తితిదే బోర్డు ఛైర్మన్ తీరు "తా బట్టిన కుందేలుకు మూడే కాళ్ల"న్న చందంగా ఉన్నదని పలువురు విమర్శిస్తున్నారు. తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారి కృష్ణారావు, స్వర్ణమయం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని సీఎంకు లేఖ రాసినా తితిదే ఛైర్మన్ లెక్క చేయడం లేదు.

అంతేకాదు శ్రీవారి అశేష భక్తులలో చాలామంది ఆనంద నిలయాన్ని స్వర్ణమయం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పండితులు కూడా ఈ నిర్ణయం సరైంది కాదని చెపుతున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తిరుమలేశుని ఆనంద నిలయాన్ని స్వర్ణమయం చేయడాన్ని ఆపలేరని ఆదికేశవులు నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి శ్రీనివాసుని సంకల్పమేమిటో...?!!

వెబ్దునియా పై చదవండి