తెలంగాణ వాదులు పోరాటం ఆపకండి: మల్లోజుల

శుక్రవారం, 25 డిశెంబరు 2009 (13:05 IST)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు తెలంగాణ వాదులు పోరాటం కొనసాగించాలని మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ పిలుపునిచ్చారు. ఉద్యమంలో ఉన్న విద్యార్థులు, యువకులు పట్టు విడవకూడదని ఆయన చెప్పారు.

చిదంబరం తాజాగా చేసిన ప్రకటనను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు మీడియాకు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కిషన్ జీ ఫోన్ ద్వారా మీడియాతో మాట్లాడారు.

రాజకీయ పార్టీల నాయకులు చెబుతున్నట్లు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనంత మాత్రాన ప్రజలు ప్రాంతాల వారీగా విడిపోవడం జరగదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి లేదని చిదంబరం ప్రకటన చూస్తే అర్ధమవుతుందని ఆయన కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిని దుయ్యబట్టారు.

మొన్న కేంద్రం చేసిన ప్రకటన సందర్భంగా ప్రత్యేక తెలంగాణకు నెహ్రూ కుటుంబం ఏ మాత్రం సుముఖంగా లేదని మరోసారి నిరూపితమైందన్నారు. మొదట చేసిన ప్రకటనతో చిదంబరం తెలంగాణ ప్రాంత ప్రజల మనస్సులను తాకారని కిషన్‌జీ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే పార్టీ రెండుగా చీలిపోతుందని అదిష్ఠా నాన్ని కొంతమంది సీమాంధ్ర పెట్టు బడిదారులు, ధనవంతులు, పారిశ్రామికవేత్తలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారని ఆయన ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి