డిగ్రీ సీట్లు కూడా అమ్ముకుంటారా? 30 శాతం సీట్లపై తుగ్లక్ జీవో
శనివారం, 9 అక్టోబరు 2021 (18:23 IST)
విద్యను కూడా వ్యాపారం చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలాజనాథ్ విమర్శించారు. డిగ్రీ కళాశాలల్లో 30శాతం సీట్లు అమ్ముకునేందుకు అనుమతిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శోచనీయం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శైలజనాథ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసలే ప్రభుత్వ కళాశాలల్లో వసతులు లేవని విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలను తీసుకోవడం తగదన్నారు.
2020–21 విద్యా సంవత్సరానికి ఆన్లైన్లో నిర్వహించిన ప్రవేశాల్లో వివిధ డిగ్రీ కోర్సుల్లో 2.62 లక్షల మందికి ఉన్నత విద్యా మండలి సీట్లు కేటాయించిందని, వీరిలో 65,981 మంది తెలుగు మాధ్యమంలో చేరిన వారు. వీరిలో 24,007 మంది బీఏ, 16,925 మంది బీకాం, 24,960 మంది బీఎస్సీ, 89 మంది ఇతర కోర్సులను ఎంపిక చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,551 కాలేజీలుండగా వాటిలో 0–10 శాతం మాత్రమే చేరికలున్న కాలేజీలు 502 ఉన్నాయని, 10–20 శాతంలోపు చేరికలున్నవి 490 వరకు ఉన్నాయన్నారు.
ఇంజనీరింగ్ కళాశాలల తరహాలో డిగ్రీలోనూ మేనేజ్మెంట్ కోటాను అందుబాటులోకి తెచ్చిందని, కళాశాలల యాజమాన్యాలు ఈ సీట్లను రాష్ట్రానికి చెందిన విద్యార్థులతో పాటు, దేశంలో ఎవరికైనా ఇచ్చుకోవచ్చని పేర్కొందన్నారు. ఈ కోటాలో సీట్లు పొందినవారికి ఫీజు రీయింబర్స్మెంట్ (జగనన్న విద్యాకానుక, జగనన్న వసతి దీవెన) పథకాలు వర్తించబోవని స్పష్టం చేసిందని తెలిపారు. ఈ 30 శాతం సీట్ల కోసం సాధారణ ఫీజు కంటే మూడురెట్ల ఫీజు అధికంగా చెల్లించాలని, డిగ్రీ సీట్ల అమ్మకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారన్నారు.
దీనిప్రకారం డిగ్రీ కళాశాలల సీట్లను 70 :30 గా విభజిస్తారని. ఏ-కేటగిరీలో ఉన్న 70శాతం ఉచిత సీట్లుగా భర్తీ చేస్తారని, వీటికి ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు వర్తిస్తాయన్నారు. ఇప్పటివరకు ఇది నూరుశాతం మందికి ఉండగా ఇకపై 70శాతం సీట్లకే ఉంటుందని, బీ-కేటగిరీలో ఉన్న 30శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేసుకోవచ్చు. గతేడాది 72.77 శాతం ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 70 శాతం మేరకే సీట్లు భర్తీ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు 30 శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటాకు కేటాయించినా పెద్దగా ఇబ్బందేమీ ఉండబోదని పేర్కొన్నారు.
ఈ రెండు కేటగిరీల్లో సీట్లను కూడా ఆన్లైన్లోనే భర్తీ చేస్తారని, యాజమాన్యాలు సొంతంగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసుకొనే వీలుండదని, ఒకవేళ బీ-కేటగిరీలో సీట్లు మిగిలిపోతే వాటిని మళ్లీ స్పాట్ అడ్మిషన్లో ఇచ్చుకుని, దానికి ఉన్నత విద్యామండలి అనుమతి పొందాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారన్నారు. ఒకపక్క డిగ్రీ సీట్లు మిగిలిపోతున్నాయని చెబుతోన్న ప్రభుత్వం మేనేజ్మెంట్ కోటాలో సీట్లు భర్తీ అవుతాయో, లేదోనని ఎందుకు ఆలోచించలేదన్నారు.
మూడురెట్ల ఫీజు చెల్లించేవారు పట్టణ ప్రాంతాల్లో, అదీ పేరున్న కళాశాలల్లోనే చేరతారని, ఇలాంటి కాలేజీల్లో మేనేజ్మెంట్ సీట్లన్నీ భర్తీ అయిపోతాయని, గతంలో ఇలాంటి మంచి కళాశాలల్లో వందశాతం సీట్లు విద్యార్థులకు ఉచితంగా దొరికేవని, గ్రామీణ విద్యార్థులకూ కొన్నిసీట్లు దక్కేవని, కానీ ఇప్పుడు ఇలాంటి కళాశాలల్లో పేద విద్యార్థులకు దక్కే సీట్లు తగ్గుతాయని శైలజనాథ్ తెలిపారు. ప్రభుత్వం డిగ్రీ కాలేజీల్లో సౌకర్యాలను మెరుగుపరచి పేద విద్యార్థులు అందులో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.