అమరావతిలో రెడ్ అలెర్ట్.. కొండవీటి వాగుతో ముప్పు..

సోమవారం, 20 ఆగస్టు 2018 (12:57 IST)
కేరళలో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. కేరళ ప్రజలకు ఇతర రాష్ట్రాలు చేయూత ఇస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి.


ఆదివారం రాత్రి నుంచి వర్షం మరింత ఎక్కువ కావడంతో.. ఏపీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విశాఖ అర్బన్‌లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
 
రోడ్లపైకి, ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అమరావతిలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కొండవీటి వాగు ఉప్పొంగే అవకాశం ఉండటంతో రాష్ట్ర సచివాలయానికి వరదముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖాధికారులు భావిస్తున్నారు. 
 
ముంపు ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం ఉండటంతో ఈ విషయంలో ఏం చేయాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొండవీటి వాగు వరదను ఎటు మళ్లించాలనే దానిపై తర్జనభర్జన అవుతున్నారు. ప్రస్తుతం కొండవీటి వాగు వద్ద తాడికొండ పోలీసులు పహరా కాస్తున్నారు.
 
ఉభయ గోదావరి, కృష్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సోమవారం మూడు జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాలు నీటమునిగాయి. వర్షాల కారణంగా గోదావరి జిల్లాల్లో ఇద్దరు మృతిచెందారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు