నకిలీ ఓటరు కార్డు చేయడమంటే ఫేక్ కరెన్సీని తయారు చేయడంకన్నా ప్రమాదంకరమని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ రోజున వైకాపా దొంగ ఓట్ల రిగ్గింగ్‌పై ఆయన స్పందిస్తూ, నకిలీ ఓటరు కార్డు తయారుచేయడమంటే దేశద్రోహం కింద కేసు నమోదు చేసి సీఈసీ విచారణ చేపట్టాలి. దేశ సారభౌమత్వాన్ని ప్రశ్నార్థకం చేసేలా వైసీపీ ప్రవర్తించింది. దోషులు ఎవరున్నా విచారణ చేపట్టి శిక్షించాలి.
ఫేక్ ఓటరు కార్డుతో ఆధార్, పాన్ కార్డ్, బాంక్ అకౌంట్ వంటి ఫేక్ ప్రొఫైల్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. దీన్ని పోలింగ్‌కు మాత్రమేకాకుండా జరిగే దుష్ప్రభావాలను గుర్తించాలి. దొంగల పార్టీ దొంగ ఓట్లకు పాల్పడి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచింది. కళ్లెదుటే జరిగిన అన్యాయాన్ని చూస్తుంటే రాష్ట్రంలో అరాచకం ఏస్థాయిలో వుందో అద్దంపడుతోంది.
మరి రీపోలింగ్ అడిగితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి. ఇతర ప్రాంతాల నుండి జనాన్ని తరలించి దొంగ ఓట్లు వేయించుకున్నారు. వారంతా పెళ్లిళ్లకు, గుడికి వెళ్తున్నారని వైసీపీ నేతలు పొంతనలేని సమాధానం చెప్తున్నారు. ఈ మాసంలో పెళ్లి ముహుర్తాలు వుంటాయా?
టీటీడీ కొత్త నిబంధనలు పెట్టిందా.?
ఆధార్ కార్డుతో తిరుపతి వెళ్తారు.. బిర్యాని పొట్లాలు, ఓటరు స్లిప్పుతో వెళ్తారా? ఓటరు స్లిప్పు, బిర్యాని ప్యాకెట్‌తో రావాలని టీటీడీ కొత్త నిబంధనలు ఏమైనా పెట్టిందా? అక్రమాలకు పాల్పడింది కాక వైసీపీ నేతలు సిగ్గులేకుండా బుకాయిస్తున్నారు. మీడియాపై పెద్దిరెడ్డి వెళ్లగక్కిన అక్కసు చూస్తే అనుకున్న పన్నాగం పూర్తిగా నేరవేరనట్లుంది. బస్సులు ఎవరు పెడితే నీకెందుకు మీడియాపై ఎదురుదాడికి దిగారు. తప్పు చేయకపోతే సమాధానం చెప్పడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి?
స్థానికేతరుడిగా వుండి ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా తిరుపతిలో మకాం వేశారు. భక్తిశ్రద్ధలకు నిలయమైన తిరుపతిని వైసీపీ అపవిత్రం చేస్తోంది. దైవసన్నిధి అన్న భయం కూడా లేకుండా వైసీపీ నేతలు దుర్మార్గాలకు ఒడిగట్టారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ వున్న పోలీసులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. టీడీపీ కార్యకర్తలు పట్టించిన దొంగ ఓటర్లను పోలీసులు దగ్గరుండి రక్షిస్తున్నారు. పోలీసులకు అప్పగించినా చర్యలు తీసుకోకుండా వదిలేశారు. తక్షణమే సీఈసీ జోక్యం చేసుకుని రీ పోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.