బాబూగీబూ జాన్తానై... పరిషత్ బరిలో తెలుగు తమ్ముళ్లు

గురువారం, 8 ఏప్రియల్ 2021 (17:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పినా పార్టీ నేతలు ఖాతరు చేయడంలేదు. కార్యకర్తలు కూడా ఎన్నికల విషయంలో యథావిధిగా తమ పని తాము చేసుకునిపోతున్నారు. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు కేవలం అధికారికంగా ప్రచారం చేయలేదు కానీ బరిలోనే ఉన్నారనే విషయం బహిరంగ సత్యం. ఇప్పుడు ఆ అభ్యర్థులంతా గ్రామాల్లో ఓటర్లను సమాయత్త పరిచారు.పోలింగ్ కేంద్రాల వద్ద హడావిడి చేస్తున్నారు
 
నూతన ఎస్ఈసీ నీలం సాహ్ని ఆగిపోయిన పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తాము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు.. ఎవరికి ఓటు వేయాలనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. 
 
అయితే ఎన్నికలను సింగిల్ బెంచ్ నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చిన తర్వాత మాత్రం బాబు, తాను చెప్పిందే కోర్టులు కూడా చెప్పాయని ఇప్పటికైనా ప్రజలు నిజానిజాలు అర్థం చేసుకోవాలనే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే డివిజన్ బెంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత టీడీపీ నేతలు దానిపై స్పందించలేదు. కేవలం వర్ల రామయ్య మాత్రమే సుప్రీంకు వెళ్తామని చెప్పారు. అయితే టీడీపీ ఎన్నికలను బహిష్కరించినట్టా లేనట్టా అనేది సందేహంగానే మిగిలిపోయింది.
 
వాస్తవానికి చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభ్యర్థులు ఎన్నికలను బహిష్కరించాలి. కానీ గ్రామాల్లో మాత్రం అభ్యర్థులు ఓట్లకోసం పరుగులు పెడుతున్నారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల దగ్గరకు చేరి హడావిడి చేస్తున్నారు. ఎన్నికలను బహిష్కరించినా కూడా టీడీపీ గెలిచింది అనిపించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల లాగే పరిషత్ ఫలితాలు కూడా ఉంటే.. టీడీపీకి అరకొర సీట్లే దక్కేవి. 
 
అయితే తెలివిగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి ఆ అవమాన భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు. తిరుపతి ఉప ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి, పరిషత్ ని పక్కనపెట్టేయాలని చూశారు. కానీ స్థానికంగా అభ్యర్థులు మాత్రం చంద్రబాబు మాటల్ని ఖాతరు చేయలేదు. ఇప్పటికే పలువురు నాయకులు కూడా చంద్రబాబు మాటల్ని వ్యతిరేకించారు. గెలుపు అవకాశాలున్నచోట్ల అభ్యర్థులు బరిలో నిలిచారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు