ఏపీలో ఇప్పటివరకు రూ.203 కోట్ల నగదు స్వాధీనం : ముకేశ్ కుమార్ మీనా

ఠాగూర్

గురువారం, 2 మే 2024 (16:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.203 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఆయన గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా నగదు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు 150 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా రూ.203 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సీ విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 16345 ఫిర్యాదులు అందాయన్నారు. 
 
డబ్బు, మద్యం పంపిణీపై 200 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 10,403 ఫిర్యాదులు కచ్చితమైనవి కావడంతో పరిష్కరించాం. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి 864 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా, 156 మందికి గాయాలయ్యాయి. 
 
ఇకపోతే, రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్నారు. రాష్ట్రంలో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్టు చెప్పారు. 'రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తాం. ఓటర్ల సంఖ్య 1500 దాటితే ఆక్సిలరీ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో 224 ఆక్సిలరీ పోలింగ్‌ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదనలు పంపించినట్టు ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు