వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ - జనసేన - బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైకాపా ఎమ్మెల్యేలు కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌లతో నరకం అనే పదానికి స్పెల్లింగ్ రాయిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కాకినాడ వారాహి వియభేరీ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రజల కోసం బతకాలి అనే ఒక స్ఫూర్తి తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందన్నారు. కానీ, తమ వద్ద డొక్కు స్కూటర్‌పై తిరిగే కన్నబాబు ఇవాళ్ల పెద్ద నాయకుడు అయిపోయాడని మండిపడ్డారు. వెయ్యి కోట్ల రూపాయలకు ఆస్తి పరుడు అయ్యాడని చెప్పారు. తాను మాత్రం ఆశయం కోసం నిలబడి దశాబ్దకాలంగా నలిగిపోయానని చెప్పారు.
ప్రతి ఒక్క వెధవతో మాటలు అనిపించుకున్నాని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న చిరంజీవి వల్లే కురసాల కన్నబాబు రాజకీయ నేత అయ్యాడని గుర్తు చేశాడు. చిరంజీవి పడేసిన భిక్షతో ఇవాల వైకాపా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడంటూ మండిపడ్డారు. నాడు చిరంజీవిని అవమానించారని, వాస్తవానికి అది నిర్మాతలకు సంబంధించిన విషయం అని అయినా చిరంజీవి ముందుకు వచ్చారని చెప్పారు. "నాడు చిరంజీవి, మహేశ్ బాబును ప్రభాస్‌ను జగన్ అహంకారంతో పిలిపించారు. వారిని కూర్చోబెట్టి మీరు నన్ను బతిమాలండి అని చెప్పి దాన్ని వీడియో తీశారు. ఆ వీడియోను బయటకు రిలీజ్ చేశారు. కన్నబాబును ఒక్కటే అడుగుతున్నా... సిగ్గుందా కన్నబాబు నీకు.. ఏం బతుకు నీది... ఆ నీచుడు చిరంజీవిని అవమానిస్తుంటే సిగ్గుగా అనిపించలేదా నీకు చిరంజీవి పెట్టిన రాజకీయ భిక్ష వల్లే కదా నువ్వు రాజకీయ నేత అయింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.