ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ ఆదర్శప్రాయం
శనివారం, 18 సెప్టెంబరు 2021 (13:25 IST)
అర్హత కలిగిన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టం (ఆర్ఓఎఫ్ఆర్) పథకం ద్వారా భూమి పట్టాలను అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానం అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయమని తెలంగాణా రాష్ట్రానికి చెందిన అధికారుల బృందం ప్రశంసించింది. ఈ విషయంగా తమ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించనున్నట్లు వెల్లడించింది.
రాష్ట్రంలో అర్హత కలిగిన గిరిజనులందరికీ ఆర్ఓఎఫ్ఆర్ పథకం ద్వారా అటవీ భూములకు పట్టాలను అందిస్తామని ఇచ్చిన హామీని నిలుపుకుంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది అక్టోబర్ 2న ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీని ప్రారంభించగా రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ ఇవ్వనంత భారీగా ఇప్పటి వరకూ 2.29 లక్షల ఎకరాల భూమి పట్టాలను గిరిజనులకు అందించారు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేయడంలో అక్కడి అధికారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత భారీగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను ఏ విధంగా పంపిణీ చేసారనే విషయాన్ని అధ్యయనం చేయడానికి తెలంగాణా ప్రభుత్వం ఒక అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపింది. నలుగురు సభ్యుల ఈ బృందం ఈ విషయంగా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ పి.రంజిత్ బాషా ను కలిసి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేయడానికి అనుసరించిన విధానాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రంజిత్ బాషా మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి గిరిజన కుటుంబానికి ఆర్ఓఎఫ్ఆర్ పథకం కింద కనీసం 2 ఎకరాల భూమికి పట్టాలను అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. అటవీ భూములలో పోడు వ్యవసాయాన్ని చేసుకుంటున్న గిరిజనులు అందరికీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను అందించామని చెప్పారు.
గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములు అటవీశాఖకు చెందినవి అయితేనే గతంలో వారికి పట్టాలను ఇచ్చేవారని, అటవీ భూములు కానప్పుడు గిరిజనుల దరఖాస్తులను తిరస్కరించడం జరిగేదని తెలిపారు. అయితే ఈసారి అలా కాకుండా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు లటవీశాఖకు చెందని రెవెన్యూ భూములైతే వాటికి డీకేటీ పట్టాలను అందించాలని కూడా సీఎం ఆదేశించారని, ఆ విధంగానే తాము ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలతో పాటుగా డీకేటీ పట్టాలను కూడా గిరిజనులకు అందించామని రంజిత్ బాషా వివరించారు.
ఇప్పటివరకూ 2,28,334 ఎకరాల భూమిని 1.24 లక్షల మంది గిరిజనులకు పట్టాలుగా అందించామన్నారు. 26 వేల మంది గిరిజనులకు 39 వేల ఎకరాల రెవెన్యూ భూమిని డీకేటీ పట్టాలుగా అందించడం జరిగిందని చెప్పారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని మరింత మంది గిరిజనులకు కూడా తాము భూమి పట్టాలను అందించనున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అందించిన సహకారంతోనే ఇంత భారీ స్థాయిలో పట్టాలను అందించగలిగామని అభిప్రాయపడ్డారు.
పట్టాలను మంజూరు చేసిన భూములలో సరిహద్దు రాళ్లను నాటడంతో పాటుగా ఉపాధిహామీ పథకం ద్వారా ఆ భూముల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను గురించి కూడా వివరించారు. గిరిజనులకు సంబంధించిన భూమి వివరాలు ఇతర సంక్షేమ పథకాల ద్వారా వారు పొందుతున్న ప్రయోజనాలను సమీక్షించడానికి అభివృద్ధి చేస్తున్న గిరిభూమి పోర్టల్ ను వారికి ప్రదర్శించారు.
అటవీహక్కుల పట్టాలను మంజూరు చేసే చట్టాలలో ఉన్న సమస్యలపై తెలంగాణా అధికారుల సందేహాలను రంజిత్ బాషా నివృత్తి చేసారు. కాగా గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల మంజూరు, గిరిజనుల అటవీహక్కులను గుర్తించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలు, చూపిన చొరవను తెలంగాణా అధికారులు ప్రశంసించారు. తెలంగాణాకు చెందిన డీటీడీఓ దిలీప్ కుమార్, ఎస్ఎస్ఓ ప్రవీణ్ కుమార్, ఏఎస్ఓ టి,మహేష్, డీటీ టి.శ్రీనివాసరావు తదితరులు ఈ అధికారుల బృందంలో ఉన్నారు.