‘హింస కన్నా మౌన ప్రదర్శన మేలు’.. రాజమౌళి :: ప్రత్యేక హోదా ఉద్యమానికి సినీ ప్రముఖుల సపోర్టు

గురువారం, 26 జనవరి 2017 (08:58 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోసం విశాఖ సాగ‌ర తీరంలో యువ‌త చేప‌ట్ట‌నున్న మౌన ప్ర‌ద‌ర్శ‌న‌కు మ‌ద్ద‌తుగా టాలీవుడ్ ముందుకొస్తోంది. ప‌లువురు యువ‌హీరోలు మ‌ద్ద‌తు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ‘హింస కన్నా మౌన ప్రదర్శన మేలు’ అనే పోస్టర్‌ను రాజమౌళి, రానా ట్విటర్‌ అకౌంట్లలో పోస్ట్‌ చేశారు. అలాగే.. యువహీరోలు సందీప్‌ కిషన్‌, సాయిధరమ్‌ తేజ్‌, తనీష్‌, ‘బర్నింగ్‌స్టార్‌’ సంపూర్ణేష్‌ బాబు కూడా తమ మద్దతు ప్రకటించారు. మరోవైపు.. జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు లింకు పెట్టడమేంటని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు జనసేనాని పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతి గంటకూ ఒక ట్వీట్ చొప్పున చేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును కడిగేస్తున్నారు. 
 
తాజాగా ట్వీట్ చేసిన ఆయన 'ప్రత్యేకహోదా ఐదేళ్లు కాదు, పదిహేనేళ్లు ఇవ్వాలన్నదీ మీరే... అద్భుతాలు చేయడానికి ప్రత్యేకహోదా సంజీవని కాదు అన్నదీ మీరే... హోదాను మించిన ప్యాకేజీ అంటూ చప్పట్లు కొట్టింది కూడా మీరే... ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తామని కూడా మీరే చెప్పారు.... అసలు చట్టబద్ధతే అక్కర్లేదని చెబుతున్నది కూడా మీరే... మీరేం చెప్పినా ప్రజలు విన్నారు... మరి ప్రజలేమనుకుంటున్నారో చెప్పే అవకాశం ఒక్కసారి కూడా ఇవ్వరా?' అని నిలదీశారు.
 
దీనిపై టీడీపీ నేతలు స్పదించారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేప‌ట్టే ప్ర‌తి ఉద్య‌మానికి ప్ర‌భుత్వ స్పందిస్తోంద‌ని టీడీపీ ఎమ్మెల్యేలు పంచ‌క‌ర్ల ర‌మేశ్‌బాబు, వి. అనిత‌, కేఎస్ఎన్ఎస్ రాజు అన్నారు. విశాఖప‌ట్ట‌ణంలోని స‌ర్క్యూట్‌హౌస్‌లో బుధ‌వారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో  మాట్లాడిన వారు పెట్టుబ‌డిదారుల స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ నేప‌థ్యంలో ఆర్కేబీచ్‌లో ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం నిర‌స‌న తెల‌ప‌డం స‌రికాద‌న్నారు. తాము ప్ర‌త్యేక హోదాకు వ్య‌తిరేకం కాద‌ని, కానీ ఇప్పుడు మాత్రం దానికి స‌మ‌యం కాద‌ని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి