రేపు మా జీతాల్లోనూ కోత విధిస్తారా? ఏపీ సర్కారుకు హైకోర్టు ప్రశ్న

బుధవారం, 20 మే 2020 (14:44 IST)
జ్యూడీషియల్ ఉద్యోగుల వేతనాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోత విధించడాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అసలు జ్యూడీషియల్ ఉద్యోగుల జీతాల్లో కోత విధించే అధికారం మీకెక్కడిది? అంటూ నిలదీసింది. పైగా, రేపు మా జీతాల్లోనూ కోత విధిస్తారా అంటూ నిలదీసింది. 
 
లాక్డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన జీతంలో 50 శాతం కోత విధించడాన్ని సవాల్‌ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వై.లక్ష్మీనరసింహమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. 
 
ఈ పిటిషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. దీనిపై జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్‌ ఉద్యోగులతో పాటు న్యాయాధికారుల జీతాల్లోనూ కోత పెట్టిందని తెలిపారు. 
 
జ్యుడీషియల్‌ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదని, అందువల్ల ఏ కారణంగానైనా వారి జీతాల్లో కోత విధించడానికి ప్రభుత్వానికి అధికారం లేదని గుర్తుచేశారు. ప్రభుత్వ న్యాయవాది సీహెచ్‌ సుమన్‌ దీనిపై వివరణ ఇచ్చారు. 
 
హైకోర్టు మాన్యువల్‌ ప్రకారమే ప్రభుత్వం నడచుకుందని తెలిపారు. జిల్లా న్యాయవ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని మాన్యువల్‌ చెబుతోందంటూ చదివి వినిపించారు. ఆయన వాదనలతో ధర్మాసనం సంతృప్తి చెందలేద కదా, అసలు వేతనాల్లో కోత విధించే అధికారం మీకెక్కడిది అంటూ సూటిగా ప్రశ్నించింది. 
 
ప్రభుత్వం తీరు ఏమాత్రమూ సరికాదని, జ్యుడీషియల్‌ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టే అధికారం దానికి లేదన్నది తమ ప్రాథమిక అభిప్రాయమని పేర్కొంది. హైకోర్టును సంప్రదించకుండా జ్యుడీషియల్‌ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం ఏమాత్రం సరి కాదని స్పష్టం చేసింది. 
 
అంతేగాక న్యాయశాఖలో పని చేస్తున్న పిటిషనర్‌ జీతంలో కోత విధించరాదని ఆదేశించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 26 అమలును పిటిషనర్‌ విషయంలో నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదావేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు