ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురపాలక సంస్థలకు నిర్వహించతలపెట్టిన ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదావేసింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసే చర్యల్లో భాగంగా, ప్రసుత్తం లాక్‌డౌన్ అమల్లోవుంది. ఇది ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ ఎన్నికలను మరికొంతకాలం వాయిదావేస్తున్నట్టు ఎస్ఈసీ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
పైగా, తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని ఎస్ఈసీ స్థానిక అధికారులను కోరింది. కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడం, లాక్‌డౌన్, హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిలిపివేతను కొనసాగిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది.
రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలించాక ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. కాగా, కరోనా దృష్ట్యా ఏపీలో స్థానిక సంస్థలను గత మార్చి 15 నుంచి తొలుత 6 వారాలు వాయిదా వేశారు. ఈ గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కనగరాజ్ బుధవారం సమీక్షించారు.