జగన్ ఆన్‌లైన్‌లోకి వెళ్లి చూడు... దొంగ పత్రాలతో ఎందుకు? ప్రత్తిపాటి
శుక్రవారం, 24 మార్చి 2017 (20:45 IST)
అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేశారంటూ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు. అసలు అగ్రిగోల్డ్ సంస్థకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అగ్రిగోల్డ్ ప్రొఫెషనల్ డైరెక్టరుగా వున్న ఉదయ్ దినకర్ దగ్గర 6 ఎకరాలు కొన్నది నిజమేనని అన్నారు. ఐతే ఆయన వేరేవాళ్ల దగ్గర కొని తమకు అమ్మారని అన్నారు. ఆయన అగ్రిగోల్డ్ సంస్థలో వాటాదారు కానీ ప్రమోటర్ కానీ కాదన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాళ్లు కొన్నది రూ. 3 లక్షలు. నాకు అమ్మింది రూ . 4 లక్షలు. ఉదయ్ దినకర్ 6 ఎకరాలు అమ్మారు. అగ్రిగోల్డుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎకరం రూ. 4 లక్షల చొప్పున 6 ఎకరాలు కొన్నాను. ఆన్ లైన్‌లోకి వెళ్లి చూడు జగన్. ప్రూవ్ చేయండి. అసెంబ్లీ నుంచి ఇవాళ, నిన్న పారిపోయారు.
యారాడ భూములు అగ్రిగోల్డ్‌వి కాదు... ప్రభుత్వానివి. హాయ్ ల్యాండ్ వేలం వేయాలని కోరింది చంద్రబాబే. పత్రిక పెట్టుకుని దుర్మార్గపు ఆలోచనలను ఆయన పత్రికలో రాస్తున్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు." అని అన్నారు.
అంతకుముందు విజయవాడలో జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అగ్రిగోల్డ్ గురించి నేను మాట్లాడుతుంటే... స్పీకర్ వ్యాఖ్యల వ్యవహారాన్ని తీసుకొచ్చి టాపిక్ డైవర్ట్ చేశారన్నారు. ఇంకా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. " అగ్రిగోల్డ్ గురించి నేను 20 నిమిషాలు మాట్లాడుతా. సాక్ష్యాలు చూపిస్తానంటే మైక్ కట్ చేశారు. అసెంబ్లీలో గద్దలకు సపోర్ట్ చేస్తున్నారు.
నాకు ఛాలెంజ్ చేస్తున్నారు. కానీ అంతకుముందు నేను చేసిన ఛాలెంజ్‌లకు చంద్రబాబు నాయుడు ఎందుకు స్వీకరించలేదో తెలియదు. అగ్రిగోల్డ్ సంస్థ 20 లక్షల మందికి టోపీ పెట్టింది. వేల కోట్ల రూపాయలు మింగేశారు. అతిపెద్ద స్కాం. ఈ కుంభకోణంలో అగ్రిగోల్డ్ బాధితుల ఆస్తులను గద్దల్లా తన్నుకుపోయినవారు చాలామంది వున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒక చిన్నచీమ. పెద్దచీమలు చాలా వున్నాయి.
చాలామంది పెద్ద మనుషుల చేతుల్లో ఇరుక్కున్న అగ్రిగోల్డ్ ఆస్తులు రాబట్టాలి. ప్రతిపక్ష నాయకుడిగా నేను చేస్తున్నదాన్ని చంద్రబాబు నాయుడు ఆసక్తిగా విని చర్యలు తీసుకోవాల్సింది పోయి నేను కానీ ప్రత్తిపాటి పుల్లారావు కానీ వుండాలంటారు. నాకూ ప్రత్తిపాటికి మధ్య వైరం ఏంటి.? నేను అడుగుతున్నది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయమని. నన్ను వెలివేయాలంటూ తీర్మానం చేశారు. అసలు చంద్రబాబుకు మెదడు వుందా లేదా అని అడుగుతున్నా.
21 మంది మా పార్టీ వాళ్లను తెదేపాలోకి తీసుకుని కండువాలు కప్పారు. వారితో రాజీనామా చేయించి గెలిపించుకోవాలని ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశా. మరి ఆ ఛాలెంజ్ ఎందుకు తీసుకోలేదు. ఆయనకు నచ్చినదాన్నే సవాలుగా తీసుకుంటారు. నోటుకు ఓటు కేసులో ఛాలెంజ్ చేశా. ఆ ఛాలెంజ్ తీసుకోరు. టాపిక్‌ను ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? హాయ్ ల్యాండ్ ఎటు పోయిందో ఎవరికి తెలుసు.
ఉదయ్ దినకర్ అనే వ్యక్తి అగ్రిగోల్డ్ సంస్థ డైరెక్టర్. ఆయన 2010 నుంచి వున్నారు. ఈయనే హాయ్ ల్యాండ్ డైరెక్టర్ కూడా. ఈ పెద్దమనిషి దినకర్, ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మకు 19-01-2015 నాడు భూములు అమ్మారు. ఇంతకన్నా సాక్ష్యాలు ఇంకేం కావాలి. సేల్ డీడ్ కనబడుతున్నా ఇంకా ఆధారాలు కావాలా? నన్ను ప్రూవ్ చేయమంటారు? నేనేమైనా పోలీసోడ్నా, సీబీఐ అధికారినా...? విచారణకు ఆదేశిస్తే సంబంధిత అధికారులు విచారణ చేసి నిజం రాబడుతారు. ఇవన్నీ చెప్పాలనుకుంటే స్పీకర్ నా మైక్ కట్ చేస్తారు. చంద్రబాబు నాపై సవాల్ విసురుతారు. తీర్మానాలు చేస్తారు..." అంటూ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.