నిందితులను గుర్తించిన తర్వాత బాదుడే బాదుడు : తమ్మినేని సీతారాం

బుధవారం, 25 మే 2022 (17:58 IST)
కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో హింసాత్మక చర్యలకు కారణమైన నిందితులను గుర్తించిన తర్వాత అపుడుంటది బాదుడే బాదుడు అని ఏపీ స్పీకర్, వైకాపా నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఈ హింసాత్మక ఘటనలపై ఆయన స్పందిస్తూ, కోనసీమ అల్లర్లు బాధాకరమన్నారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. 
 
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుభవిస్తూ, ఆయన పేరును మాత్రం వ్యతిరేకిస్తారా? అంటూ తమ్మినేని ప్రశ్నించారు. ఈ అల్లర్ల వెనుక ఎవరు ఉన్నారో త్వరలో తెలుస్తుందన్నారు. నిందితులను గుర్తించిన తర్వాత బాదుడే బాదుడు కార్యక్రమం మొదలుపెడతామని హెచ్చరించారు. అంతేకాకుండా, శ్రీకాకుళం జిల్లాకు అంబేద్కర్ -2 పేరు పెట్టమనండి, ఏ రాజకీయ పార్టీ అడ్డుకుంటుందో చూస్తానంటూ అన్నారు. 
 
రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. అందువల్ల కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదని పైగా ఇది నూటికి కోటి శాతం కరెక్టేనని చెప్పారు. కులాలు, మతాలు, జాతుల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని తమ్మినేని హితవు పలికారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు