ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకపై ఏ సర్కారు భవనానికి పార్టీ రంగులు వేయం... అని హైకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసింది. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టులో ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేసింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయమంటూ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది ప్రమాణ పత్రం కోర్టుకు దాఖలు చేశారు.
పార్టీ రంగులు తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని గతంలో కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు ప్రభుత్వం ప్రమాణ పత్రం దాఖలు చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తున్నారంటూ జై భీమ్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి, ఇకపై ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయం అని కోర్టుకు విన్నవించింది.