తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో మున్సిపల్ అధికారులకు కౌంటర్ ఇస్తున్నారు. అధికార సిబ్బంది తాను ఛైర్మన్ అయ్యాక కూడా తనకు సహకరించట్లేదంటూ ఆరోపిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్నంగా తన నిరసనను కొనసాగిస్తున్నారు.
మున్సిపల్ ఆఫీసులోనే నిన్న రాత్రి నిద్దరపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి... ఉదయం స్నానం కూడా ఆరుబయట ఇలా పైపు నీళ్ళతో చేశారు. అక్కడే బట్టలు మార్చుకుని, మున్సిపల్ అధికారుల కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.
నిన్న మున్సిపల్ ఛైర్మన్ అధికారుల కోసం కార్యాలయంలో వేచి ఉండగా, అంతకుముందే ఎమ్మెల్యే పెద్దారెడ్డితో కలిసి బయటికి వెళ్లిన అధికారులు సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో అసహనానికి గురైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆఫీస్ వద్దే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. రాత్రికి కార్యాలయంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఉంటారని చెబితే, ఏదో సరదాకి అంటున్నారని అధికారులు, జేసీ అనుచరులు కూడా అనుకున్నారు.
కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ, జేసీ ప్రభాకర్ రెడ్డి రాత్రి మున్సిపల్ కార్యాలయంలోనే పడుకున్నారు. ఉదయం నిద్ర లేచి అక్కడే స్నానం కూడా చేసేశారు. అక్కడే బట్టలు వేసుకుని. మున్సిపల్ అధికారుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక అధికారులు వచ్చాక ఎంత గడబిడి అవుతుందో అని అంతా టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.