తిరుమల ఘాట్ రెండో రోడ్డులోని భాష్యకారుల సన్నిధి వద్ధ మోకాళ్లమెట్ల సమీపంలో ప్రయాణిస్తున్న ఒక కారు ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. దీనిని గమనించిన కారులోని ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేసి కిందకు దిగిపోయారు. వారు దిగిన కొన్ని క్షణాల్లోనే కారులో మంటలు పెద్దవిగా వ్యాపించి వాహనాన్ని చుట్టుముట్టాయి. వారంతా చూస్తుండగానే ఆ కారు మండల్లో కాలిపోయింది.
దీనిపై సమాచారం అందుకున్న తిరుమల అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కారు చాలా భాగం కాలిపోయినప్పటికీ, మిగిలిన మంటలను వారు ఆర్పివేశారు. ఈ సంఘటన కారణంగా ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, అగ్నిమారకదళ సిబ్బంది కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.