స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న రిమాండ్ ఖైదీగా ఉంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. 73 యేళ్ల వయసులో ఉన్న చంద్రబాబు ఆరోగ్య సమస్యల్ని కావాలనే దాచిపెడుతోందని పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా, చంద్రబాబు కంటి సమస్యలకు చికిత్స అవసరమని బుధవారం ఆయనను పరిశీలించిన ప్రభుత్వ ఆస్పత్రి కంటివైద్యులు నివేదిక ఇచ్చినట్టు వారు చెబుతున్నారు.
అయితే, చంద్రబాబు కంటికి ఇప్పట్లో ఎలాంటి చికిత్స అవసరం లేదన్నట్లుగా ఆ నివేదికను మార్చి ఇవ్వాలని ప్రభుత్వ వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బుధవారం జైలు అధికారులు విడుదల చేసిన చంద్రబాబు హెల్త్ బులెటిన్‌లోనూ కంటిసమస్యను ప్రస్తావించకపోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణపై రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ను మీడియా వివరణ కోరగా చంద్రబాబుకు నాలుగు నెలల క్రితం ఒక కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని, రెండో కంటికి వెంటనే ఆపరేషన్ అవసరం లేదని బుధవారం ఆయనను పరిశీలించిన వైద్యులు చెప్పారని తెలిపారు. అయితే, ఈ వ్యాఖ్యలను టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే అలా నడుచుకుంటుందని వారు ఆరోపిస్తున్నారు.