చంద్రబాబుకు బాణంలా మారిపోయిన పవన్‌ కళ్యాణ్‌... పెద్ద బకరా ఎవరు?

గురువారం, 22 డిశెంబరు 2016 (10:51 IST)
ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే అన్నది సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రంలోని ఓ సినిమా డైలాగు. సినిమాల్లో అయితే పవన్‌ కళ్యాణ్‌ కూడా ఇదే పాటించావాడేమో కానీ రాజకీయాల్లో మాత్రం ఎన్నిసార్లు అయినా బకరా కావడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. నోట్ల రద్దు తెదేపా రాజకీయంగా బాగా కలిసొచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. మొదట్లో క్రెడిట్‌ తీసుకోవడానికి తొందరపడిన చంద్రబాబు దాని పర్యవసానం తెలిసిరావడానికి పెద్దగా టైం పట్టలేదు. అందుకు ఆ నిర్ణయంపై సన్నాయి నొక్కులు మొదలుపెట్టాడు. కాకపోతే చంద్రబాబు కంటే ఒక ఆకు ఎక్కువే చదివిన మోడీ కమిటీ పేరుతో నోట్ల రద్దు విషయంలో చంద్రబాబును కూడా భాగస్వామిని చేశాడు. దీంతో లాక్కోలేక, పీక్కోలేక చంద్రబాబు ఇబ్బంది పడతారని అందరూ భావించారు.
 
కానీ రెండువైపుల పదునుతో ఉండే చంద్రబాబును బంధించడం అంత ఈజీ కాదు. అందుకే బిజెపిపైకి పవన్‌ బాణాన్ని ప్రయోగించాడు. ఎప్పుడూ లేని విధంగా బిజెపిపై పవన్ కళ్యాణ్‌ పదునైన విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. తేడా వస్తే ఎన్డీయే నుంచి బయటకు రావడానికి కూడా చంద్రబాబుకు ఇది ఉపయోగపడుతోంది. ప్రజా వ్యతిరేకతతో అల్లాడిపోతున్న బిజెపి కూడా ఇది తమ ఒక్కరి పని మాత్రమే కాదని, చంద్రబాబులాంటి వాళ్ళను కలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. నోట్ల రద్దుతో మంచి పేరు వస్తుందనుకున్న చంద్రబాబు ఎవరి అనుమతి లేకుండానే అక్రిడెట్‌ తీసుకున్నాడు.
 
ఇప్పుడు కథ అడ్డం తిరిగే సరికి ఆ నిర్ణయంలో భాగస్వామి కావాలంటే కొన్ని షరతులు అంటూ కొత్త పల్లవి అందుకున్నట్లు సమాచారం. దీనికి బిజెపి కూడా అంగీకరించినట్లే కనిపిస్తుంది. జగన్‌ కేసులో స్పీడ్‌ పెరగడమే దానికి నిదర్శనం. ఇక మరో వైపు పవన్‌ ద్వారా బిజెపిని తిట్టిస్తే పేరు అటైనా ఇటైనా వెళ్ళడానికి ఈజీగా ఉంటుందన్నది చంద్రబాబు ఆలోచన. ఇందుకోసం మరోసారి బకరా కావడానికి పవన్‌ కళ్యాణ్‌ను కూడా సిద్థం అయినట్లే ఉన్నాడు. కాకపోతే ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇచ్చిన బిజెపిని తిట్టిన పవన్‌ కళ్యాణ్ దానిని ఒప్పుకున్న చంద్రబాబును మాట మాత్రం కూడా అనకపోవడంతో అప్పట్లో పెద్ద బకరాగా మిగిలాడు. ఇప్పుడు పెద్ద నోట్లను రద్దు చేసిన మోడీని విమర్శిస్తున్నాడు. అది మోడీకి నేనిచ్చిన సలహానే అని డప్పులు కొట్టుకున్న చంద్రబాబును ఏమీ అనకపోవడం విడ్డూరంగా లేదు.

వెబ్దునియా పై చదవండి