దేశంలో శతకాన్ని దాటేసిన పెట్రోలు ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సైకిల్ యాత్రను ఆరంభించింది. కడప జిల్లా మైదుకూరులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెరిగిన పెట్రోలు, వంట గ్యాస్ ధరలకు నిరసనగా మైదుకూరులో సైకిల్ యాత్ర, సంతకాల సేకరణ చేశారు.
కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాలు జలగల్లా ప్రజల రక్తం పీల్చి తాగుతున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు అసాధారణ రీతిలో పెంచడం అమానుషమన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై పెంచిన ఎక్సైజ్ సుంకం ఉపసంహరించాలని డిమాండు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై అదనపు వ్యాట్, రోడ్డు సెస్సును ఉపసంహరించాలన్నారు. పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండు చేశారు. జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, కడప పార్లమెంట్ ఇంచార్జ్ గుండ్లకుంట శ్రీరాములు, సుబ్బరాయుడు గొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి , శ్యామల దేవి విష్ణు ప్రీతం రెడ్డి, కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.