తిరుపతిలో రెచ్చిపోతున్న దళారీలు, నకిలీ టిక్కెట్లతో శ్రీవారి భక్తులకు టోకరా

మంగళవారం, 20 జులై 2021 (22:27 IST)
ఆన్ లైన్ ద్వారా శ్రీవారి దర్సన టిక్కెట్లను పొందాలని టిటిడి చెబుతోంది. ఎప్పటి నుంచో ఇదే విషయాన్ని చెబుతూ వస్తోంది. భక్తులు సహరించాలని విజ్ఙప్తి చేస్తోంది. ఆఫ్ లైన్ ద్వారా ఎక్కడా టోకెన్లు ఇవ్వడం లేదని..అలా ఇస్తున్నట్లు ఎక్కడైనా చెప్పినా..ఎవరైనా ఇస్తున్నా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతోంది.
 
అయితే టిటిడి ఎన్నిసార్లు హెచ్చరించినా చాలామంది భక్తులు స్వామివారిని దర్సించుకోవాలన్న ఆశతో దళారీల చేతిలో మోసం పోతున్నారు. గతంలో తిరుమలలో విఐపి దర్సన టిక్కెట్లను అధిక రేట్లకు విక్రయించి డబ్బులు దండుకునే దళారీలు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు.
 
దర్సన టిక్కెట్లు లేకుండా తిరుపతికి వచ్చే వారు అలిపిరి వద్ద కనిపిస్తే వారిని మెల్లగా మాటల్లో దింపి వారి నుంచి డబ్బులు లాగేస్తున్నారు. భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. తాజాగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద తిరుమల వెంకన్న దర్సనానికి వచ్చిన 14మంది మహారాష్ట్ర మోసగించారు దళారీలు.
 
ఉచిత దర్సన టిక్కెట్లు ఇవ్వకపోవడంతో అక్కడే ఉన్న దళారులు వారికి మాయ మాటలు చెప్పి 300రూపాయల దర్సన టిక్కెట్లను ఇస్తానని చెప్పారు. తిరుమల వెంకన్న 300 రూపాయల టిక్కెట్లను ఒక్కొక్కరి వద్ద 900 రూపాయల చొప్పున వసూలు చేశారు.
 
భూదేవి కాంప్లెక్స్ వద్ద వారికి నకిలీ దర్సన టిక్కెట్లను విక్రయించిన నవనీత్  క్రిష్ణ, వేణుగోపాల్ లను టిటిడి విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. టిటిడి విజిలెన్స్ సిబ్బంది అలిపిరి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై అలిపిరి పోలీసులు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
 
అదుపులోకి తీసుకున్న నిందితులు గతంలో నవనీత్ క్రిష్ణ మర్డర్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. వేణుగోపాల్ తిరుమలలో టిటిడి అద్దె గదులను అధిక ధరకు విక్రయిస్తూ పట్టుబడ్డారన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు