ఏపీలోని ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు

గురువారం, 27 జులై 2023 (11:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆ జిల్లాలో విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. దీనికి కారణం విస్తారంగా వర్షాలు కురుస్తుండటమే. బుధ, గురువారాల్లో కూడా భారీ వర్ష సూచన ఉందని హెచ్చరించడంతో విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. 
 
విద్యార్థుల రవాణా, తరగతి గదుల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో తరగతులను నిర్వహించవద్దని కోరారు. భారీ వర్ష సూచనను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని విద్యాసంస్థలను మూసి వేసేలా పర్యవేక్షించాలని ఎంఈవో, డిప్యూటీ డీఈవోలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
 
ఇదిలావుంటే, మంగళవారం విశాఖ నగరంలో కురిసిన భారీ వర్షానికి పూర్తిగా నీటిమయమైంది. ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం నుంచి నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీళ్లన్నీ రోడ్లపైనే నిలిచివున్నాయి. దీంతో నగర వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. పూడుకుపోయిన డ్రైనేజీలతో నీటి ప్రవాహం రోడ్లపైకి చేరి ముఖ్యమైన జంక్షన్లు చిన్నపాటి నీటి కుంటలను తలపిస్తున్నాయి. ఆర్కే బీచ్ రోడ్డులో కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోలకు తీవ్ర అంతరాయం కలిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు