ప్రమాదం ముంగిటి హైదరాబాద్ నగరం... నేడు అతి భారీ వర్షం

బుధవారం, 26 జులై 2023 (09:25 IST)
హైదరాబాద్ నగరంలో ప్రమాదం ముగింటి ఉంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఇప్పటికే నీట మునిగిపోయింది. తాజాగా హైదరాబాద్ నగరానికి అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. జోన్లవారీగా హెచ్చరికలు జారీ చేసింది.
 
చార్మినార్‌ జోన్‌, ఖైరతాబాద్‌ జోన్‌, ఎల్బీనగర్‌ జోన్‌, శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కూకట్‌పల్లి జోన్‌కు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ సైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటలో 3 నుంచి 5 సెం.మీ. వర్షం కురిసే సూచనలున్నాయని, కొన్నిసార్లు 5 నుంచి 10 సెం.మీ. కూడా కావచ్చని వెల్లడించింది. గంటకు 10 నుంచి 14 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
 
భారీ నుంచి అతి భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమవుతాయి. గాలులతో చెట్లు నేలకూలే ప్రమాదం ఉంది. విద్యుత్తు స్తంభాలు దెబ్బతినడం, కరెంటు సరఫరాలో అంతరాయాలకు అవకాశం. ఐదు జోన్ల పరిధిలో ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. వీటి పరిధిలో గురువారం మోస్తరు నుంచి కొన్నిసార్లు భారీ వర్షం కురియవచ్చు. శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉండవచ్చని వెల్లడించింది. గంటలో 2 నుంచి 3 లేదా 5 సెం.మీ. దాకా వర్షపాతానికి వీలుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు