నెల్లూరులో రొట్టెల పండుగ.. భారీగా తరలివచ్చిన భక్తులు

ఆదివారం, 30 జులై 2023 (14:41 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరులో రొట్టెల పండుగ జరిగింది. ఈ పండుగ కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే పండగగా ఈ రొట్టెల పండుగ ప్రసిద్ధిగాంచింది. ఈ పండుగ శనివారం నుంచి ప్రారంభమైంది. స్థానికంగా ఉండే స్వర్ణాల చెరువు ప్రాంగణంలో ఈ పండుగ ప్రారంభమైంది. 
 
ఐదు రోజుల పండుగలో భాగంగా, తొలిరోజున బారాషాబీద్ దర్గాలో 12మంది అమరవీరుల సమాధులను ముస్లిం మతపెద్దలు సంప్రదాయబద్ధంగా శుభ్రం చేసి, నూతన వస్త్రాలను సమాధులపై కప్పి ప్రార్థనలు నిర్వహించారు.
 
కాగా, ఈ పండుగ తొలి రోజున రాష్ట్రం నుంచేగాక తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. స్వర్ణాల చెరువులో స్నానం చేసిన అనంతరం కోర్కెల రొట్టెల కోసం ఎగబడ్డారు. అంతకుముందు దర్గాలో ప్రార్థనలు చేశారు. 
 
జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అధికార బృందంతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 2500 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ టీడీపీ నేతలు స్వర్ణాల చెరువులో రొట్టెను వదిలి, వారు కూడా పట్టుకున్నారు. 
 
ఇక పండుగలో కీలక ఘట్టమైన గంధ మహోత్సవం ఆదివారం రాత్రి జరుగనుంది. ఈ కార్యక్రమానికి కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేనీ విచ్చేసి ఈ గంధ మహోత్సవంలో పాల్గొననున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు