ఆఫ్రికాలోని ఇథియోపియాలో అత్యంత కిరాతకమైన ఘోరం చోటు చేసుకుంది. కొంత మంది దుండుగుల దురాగతానికి హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బలయ్యారు. రాగి గనుల వ్యాపారం నిమిత్తం ఇథియోపియాకి వెళ్లిన పీవీ శశిధర్ కారును అడ్డుకున్న దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆయనతోపాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
వివరాలలోకి వెళ్తే... హైదరాబాద్ అశోక్‌నగర్‌కు చెందిన పీవీ శశిధర్ బాలానగర్ సమీపంలో పంటల ఉత్పత్తులు, ఇతర వస్తువులను నిల్వ చేసేందుకు ఏసీ గోదాములు నిర్వహిస్తూంటారు. రాగి గనుల వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో గత కొంతకాలంగా ఇథియోపియాకి వెళ్లి వస్తున్నారు. దీనికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వం ఆయనకు అనుమతులు కూడా మంజూరు చేసింది.
19వ తేదీన రాగి గనుల క్షేత్ర పరిశీలనకు రెండు కార్లలో పదిమంది బయల్దేరడం జరిగింది. ముందు కారులో ఐదుగురు ఉండగా... వెనుక కారులో శశిధర్‌తో పాటు ఒక జపాన్ మహిళ, ముగ్గురు ఇథియోపియన్లు ఉన్నారు. కొంతదూరం వెళ్లాక శశిధర్ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల నుండి తేరుకొనేలోగానే కారుపై పెట్రోల్ పోసి నిప్పటించి వెళ్లిపోయారు. దీంతో కారులో ఉన్న శశిధర్‌తో సహా ఐదుగురు సజీవ దహనమయ్యారు. శశిధర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతితో అశోక్‌నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.