అరాచకమే జగన్ రెడ్డి ప్రభుత్వ విధానమా?: కాంగ్రెస్

బుధవారం, 10 నవంబరు 2021 (18:44 IST)
రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ద్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రౌడీయిజం... విధ్వంసాలు... ఘర్షణలు తప్ప జరిగిన అభివృద్ధి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో లీటరు పెట్రోలు పై రూ.28.49పైసలు, లీటరు డీజిల్ పై రూ.21.78పైసలు పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ ఎందుకు తగ్గించ దని శైలజనాథ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర అభివృద్ధికి విఘాతంగా మారాయని ఎద్దేవా చేశారు.

బుధవారం ఆంధ్ర రత్న భవన్ నుంచి ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో  ఇలాంటి ప్రజా వ్యతిరేక పాలన జరగలేదని గుర్తు చేశారు. కుల, బంధు వర్గాలకు మేలు చేసి వారి ఆస్తులు పెంచుకోవడానికి తప్ప ప్రజల సంక్షేమాన్ని ప్రాంతీయ పార్టీలు పట్టించుకునే స్థితిలో లేవని ఆయన ఆరోపించారు. ప్రజల డబ్బులను దుబారా చేస్తూ రాష్ట్ర వినాశనానికి నాంది పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
నాడు ముద్దులు - నేడు గుద్దులు - ఇదే నాడు -నేడు
ఈ ప్రభుత్వానికి విద్యార్ధులపై ఎలాంటి ప్రేమ, కనికరం లేదని, రాష్ట్రంలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితిని చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నామని, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్ని కొనసాగించాలని కోరినందుకు అనంతపురంలో విద్యార్థులపై లాఠీఛార్జి చేస్తారా? దీనిపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. 

ఇది అమానుషం, అనాగరికం. ప్రైవేట్‌ ఎయిడెడ్‌ కళాశాలలకు గ్రాంట్‌, సిబ్బందిని యథాతథంగా అమలుచేయాలన్నారు. నెల్లూరు వీఆర్‌ కళాశాల, ఎన్టీఆర్‌ చదివిన గుంటూరు ఏసీ కళాశాలల భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారనీ, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెడుతూ అప్పులు చేస్తున్నారు? కాగ్‌కు కూడా లెక్కలు చెప్పరా? రేపో, ఎల్లుండో ప్రైవేటు ఆస్తులనూ తాకట్టు పెడతారేమో? అని విమర్శించారు.

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కువ అని, వాటిని తగ్గించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. త్వరలో చేపట్టబోయే "జన జాగరణ యాత్ర" లో ఈ ప్రభుత్వాల దుర్మార్గాలను ప్రజలకు స్వయంగా వివరిస్తామని శైలజనాథ్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు