అబద్ధాలను అందంగా చెప్పడంలో జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: వైఎస్ షర్మిల

ఐవీఆర్

శుక్రవారం, 29 నవంబరు 2024 (15:35 IST)
అబద్ధాలను అందంగా చెప్పడంలో జగన్ మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అంటూ ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. శాలువాలు, సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఆమె ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.
 
ఆమె ట్విట్టర్లో పేర్కొంటూ... '' 2021, మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రూ.2.14 పైసలు ఉంటే, తమరు రూ 2.49 పైసలకు కొన్నందుకు శాలువలు కప్పాలా? అదానీ వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర రూ 1.99 పైసలకే కొంటే.. అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి, రూ.2.49 పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా? అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా? 
 
ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే గుజరాత్‌కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూ 1.99 పైసలకు అదానీ ఎందుకు ఇవ్వలేదు? రూ.2.49 రేటుకు మీరెందుకు ఒప్పుకున్నారు? ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్ఠంగా యూనిట్ రూ.1.70 పైసలు పడతాయని మీ హయాంలోనే ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా? ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా? దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.
 
నిజమే.. అదానీతో మీ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర. అదానీ కలవడం ఒక చరిత్ర. రూ.1750 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం చరిత్ర. ఎవడు కొనేందుకు ముందుకు రాని విద్యుత్‌ను బంపర్ ఆఫర్‌గా ప్రకటించుకోవడం చరిత్ర. గంటల్లోనే క్యాబినెట్ పెట్టడం చరిత్ర. ప్రజా అభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్ర. అదానీ కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం చరిత్ర. ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం AP రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్ర.  ప్రపంచం మొత్తం ఇప్పడు తమరి అవినీతి గురించి మాట్లాడుకోవడం మీ గొప్ప చరిత్ర. భూగోళం అవినీతి పరుల జాబితాలో మీపేరు చేరడం మీకు పెద్ద చరిత్ర.
 
అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్‌లో నాపేరు ఎక్కడుందని బుకాయించే జగన్ గారు.. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు మీరు కారా.. ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్నల్ని నడిపించే వాళ్లు కూర్చున్నారా..? ఇదేం ఆఫ్ బేస్ట్ నాలెడ్జ్? ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం..? మీరు అవినీతి చేశారని చెప్పింది మేము కాదు. అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు FBI, SEC స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయి. సోలార్ పవర్ ఒప్పందాల్లో రూ.1750 కోట్లు AP చీఫ్ మినిస్టర్‌కి ఇచ్చారని తమ దర్యాప్తులో కుండబద్దలు కొట్టాయి. ముడుములు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని ఓ వంద పేజీల రిపోర్ట్ కూడా ఇచ్చాయి. వివిధ సోర్స్‌ల నుంచి సాక్ష్యాలు, ఆధారాలు సమీకరించాం అని రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నాయి.
 
గత టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు PPL చేసుకుందని, రూ.35వేల కోట్ల భారం వేసిందని చెప్పే మీరు.. అధికారంలోకి వచ్చాక  గాడిదలు కాశారా? టెండర్లు రద్దుతో ఎందుకు సరిపెట్టారు? ఎందుకు విచారణ జరిపించలేదు? లాంగ్ స్టాండ్ ఒప్పందాలతో నష్టమని తెలిసి అదానీకి 25 ఏళ్లు రాష్ట్రానికి తాకట్టు పెట్టినప్పుడే మీకెంత ముట్టాయో అర్ధమవుతోంది. గంగవరం పోర్టును అడ్డికి పావుసేరు లెక్కన రూ.640 కోట్లకే అమ్మినప్పుడే మీ ముడుపుల బంధం ఏపాటితో తెలిసిపోయింది. రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్కులా అదానీకి కట్టబెట్టినప్పుడే మీ వాటాల సంగతి తేలిపోయింది. 
 
నిజంగా అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, అదానీతో రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే, మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి. దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సవాల్‌ను స్వీకరించాలి." అంటూ షర్మిల పోస్ట్ చేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు