శాసనసభ్యులా... శాడిస్టు సభ్యులా...?: టీడీపీ

బుధవారం, 20 నవంబరు 2019 (07:35 IST)
మంత్రి కొడాలినాని భాష, ప్రవర్తనచూసి రాష్ట్రప్రజలంతా సిగ్గుతో తలొంచుకుంటున్నారని , వైసీపీ శాసనసభ్యులను, శాడిస్టు సభ్యులుగా భావిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శాసససభ్యుడిగా ఎన్నికై, మంత్రి పదవిపొందిన నాని కంటే, చదువుసంధ్యలు లేనివాళ్లు ఎంతోసభ్యత, సంస్కారంతో మాట్లాడతారన్నారు.

కొడాలినాని భాష, ప్రవర్తనతో పాటు, కొందరు మంత్రులు నిర్లజ్జగా వ్యవహరిస్తున్న తీరుపై  ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్రప్రజలకు సమాధానం చెప్పాలని మాణిక్యరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్సీ అశోక్‌బాబుతో కలిసి పిల్లి మాణిక్యరావు విలేకరులతో మాట్లాడారు.
 
తనకేబినెట్‌లో ఉన్న మంత్రులు ఇష్టానుసారం నోరుపారేసుకుంటుంటే, సీఎం పదవిలో ఉన్న జగన్‌, చోద్యం చూస్తూ ఏమీపట్టనట్లుగా ఉండటం ఆయనకు భావ్యంకాద న్నారు. ప్రజలతరపున మాట్లాడేవారిపై నోరుపారేసుకోవడం, ఉచ్ఛనీచాలు మరిచిమాట్లాడ టం తప్ప, మంత్రులకు పాలనాపరమైన అంశాలపై అవగాహనలేకుండా పోయిందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పవిత్రక్షేత్రంగా పేరొందిన తిరుమల గురించి నీచంగా మాట్లాడిన మంత్రి కొడాలి వ్యాఖ్యలపై, ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నాడంటే, ఆయనకూడా కొడాలి వ్యాఖ్యలను సమర్థిస్తున్నాడనే అనుకోవాల్సి వస్తుందన్నారు. బూతుపురాణం, అసభ్యప్రవర్తన  తెలిసినవారిని ఏరికోరిమరీ జగన్‌ మంత్రులుగా ఎంపికచేసినట్లుందని పిల్లి ఎద్దేవాచేశారు.

టీడీపీ యువనేత లోకేశ్‌ని ఉద్దేశించి పప్పు అని, ఆయనకు మాట్లాడటం రాదని ప్రచారం చేస్తున్న వైసీపీమంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనలోని గొప్ప ప్రవర్తన, హుందాతనం, సభ్యత, సంస్కారాలను చూసి సిగ్గుపడాలన్నారు. పప్పుకంటే, చిప్పకూడు ఇంకా దారుణమని, జైలుకెళ్లినవారికి ఆ కూటి విలువబాగా తెలుసునని మాణిక్యరావు దెప్పిపొడిచారు.

టీడీపీనేత లు సన్నబియ్యంపై ప్రశ్నించారన్న అక్కసుతో బూతుపురాణం పఠించిన నాని, త్వరలోనే ప్రజలచేతిలో దారుణ పరాభవం చవిచూస్తారన్నారు. సన్నబియ్యంపై మాటతప్పిన నాని, అసెంబ్లీకి ఎలాంటి అవతారంతో వెళ్తున్నాడో, అక్కడ ఎలా ప్రవర్తిస్తున్నాడో ఆయనే ఆలోచించుకోవాలన్నారు.
 
వైసీపీ పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదు:  మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ 
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పాదయాత్రలో రైతులను ఉద్ధరిస్తామని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి, అధికారంలోకి వచ్చాక వారిని అన్నివిధాల మోసం చేశాడని, పంటఉత్పత్తులకు  గిట్టుబాటధరకూడా కల్పించలేని దౌర్భాగ్యస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు.

ఖరీఫ్‌, రబీలో 2017-18 సంవత్స రానికి గాను, 157లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం దిగుబడివస్తే, ఈఏడాది 2019-20  లో 151లక్షల మెట్రిక్‌టన్నులకే రాష్ట్రప్రభుత్వ అంచనాలు పరిమితమయ్యాయన్నారు. వ్యవసాయరంగంపై ప్రభుత్వ పోకడలు, ఆలోచనా విధానం చూస్తుంటే, పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

అధికారంలోకి వచ్చినప్పటినుంచీ, రాష్ట్రప్రభుత్వం వ్యవసాయరంగంపై ఏవిధమైన సమీక్షలు, సమావేశాలు నిర్వహించలేదని, గిట్టుబాటుధర, ఉత్పత్తుల పెంపుదల, మార్కెటింగ్‌ అవకాశాలపై రైతులు, రైతునాయకులతో ఒక్క సమావేశంకూడా నిర్వహించకపోవడం శోచనీయమని ఆలపాటి చెప్పారు. రైతుకమిషన్‌ ఏర్పాటుతో సరిపెట్టి న ప్రభుత్వం, మద్దతుధర విషయంలో ఏం చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే 281మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని,    అన్నదాతల చావులను కూడా పక్కదారి పట్టించేపనిలో ప్రభుత్వం ఉందని మాజీమంత్రి     స్పష్టంచేశారు. ధాన్యం సహా, ఇతర అపరాలపంటలైన మినుములు, పెసలు, జొన్న, మొక్కజొన్న, పసుపు వంటి పంటలకు గిట్టుబాటుధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు.

వినియోగదారుడికి కొనబోతే కొరివి, రైతులకేమో అమ్మబోతే అడవి అన్నతీరుగా రాష్ట్రంలో పంటలఉత్పత్తులు ఉన్నాయన్నారు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కింద బడ్జెట్లో రూ.1000కోట్లు కేటాయించామన్న ప్రభుత్వం, జొన్న, మొక్కజొన్న, పసుపు, మినుము, పెసర, వేరుశనగ ధరలు పడిపోతే ఏంచర్యలు తీసుకుందని మాజీమంత్రి నిలదీశారు.

నీరు అందుబాటులో ఉన్నా, సరైన వ్యవసాయ విధానం, సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయలేకపోవడం వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగం తలకిందులైందన్నారు.  రైతు రుణమాఫీని రద్దుచేసి, రైతుభరోసా తీసుకొచ్చిన ప్రభుత్వం ఎంతమందికి భరోసా కల్పించిందో, ఎంతమందికి వడ్డీలేనిరుణాలు ఇచ్చిందో సమాధానం చెప్పాలని ఆలపాటి డిమాండ్‌చేశారు.

టీడీపీ ప్రభుత్వం విడుదలచేసిన 4,5 విడతల రుణమాఫీసొమ్ము రైతులకు దక్కకుండా మోకాలడ్డిన జగన్మోహన్‌రెడ్డి, రైతుభరోసా పేరుతో రూ.13,500 ఇస్తామని ఇప్పుడు కేవలం రూ.7,500లు ఇస్తూ, రైతుల్ని నిలువునా మోసగించాడన్నారు. కోటిమంది రైతులుంటే, కేవలం 40లక్షల మందికే అరకొరగా రైతుభరోసా అమలుచేశారని రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు.

కౌలురైతుల్ని కూడా గుర్తించలేని గుడ్డిప్రభుత్వం, రైతుభరోసా ప్రకటనల పేరుతో కొన్ని లక్షలరూపాయల్ని దుర్వినియోగం చేసిందన్నారు. చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై ఆరోపణలుచేయడం తప్ప, ఈ 6నెలల్లో ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఆరోగ్యశ్రీ సేవలకోసం పొరుగురాష్ట్రాలకు వెళ్లమంటున్న రాష్ట్రప్రభుత్వం, రాష్ట్రంలోని ఆసుపత్రులను ఎందుకు బాగుచేయడం లేదన్నారు?  
 
ఆదా చేశామంటూ... జగన్‌ ఇంటికి రూ.20కోట్లు పెడతారా?
రివర్స్‌ టెండరింగ్‌పేరుతో పోలవరం పనులుఆపేసిన రాష్ట్రప్రభుత్వం, రాష్ట్రవ్యవసాయ రంగానికి తలమానికంగా నిలవాల్సిన సాగునీటిప్రాజెక్ట్‌ని మూలనపడేసిందని ఆలపాటి  మండిపడ్డారు.

ప్రజాధనం మిగిల్చామని డబ్బాలు కొట్టుకుంటున్న రాష్ట్రయంత్రాంగం, జగన్మోహన్‌రెడ్డి నివాసానికి రూ.20కోట్లు తగలేసిందని, బాత్రూమ్‌లకు రూ.10లక్షలు, కిటికీలకు రూ.80లక్షలు, రోడ్డు నిర్మాణానికిరూ.5కోట్లు ఖర్చుచేయడమేంటని ఆలపాటి నిలదీశారు.

కేవలం అన్నాక్యాం టీన్ల రంగు మార్చడానికి రూ.1100కోట్లు ఖర్చుచేసిన జగన్‌ప్రభుత్వం ఎంతసొమ్ము ఆదాచేసిందో, ఎవరికి మేలుచేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నవరత్నాలపేరుతో రాష్ట్రప్రజల నవరంధ్రాలను మూసేసిన ఘనత జగన్‌ కే దక్కుతుందన్నారు.

ప్రజల్ని భ్రమల్లో ముంచి, చంద్రబాబు సంక్షేమ పథకాలను రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షంపై బురదజల్లుతూ కాలక్షేపం చేస్తోందన్నారు. ఉచిత ఇసుకవిధాన ం రద్దుతో 30లక్షలమంది భవననిర్మాణ కార్మికులను రోడ్డునపడేసిన ప్రభుత్వం, జీవోల పేరుతో ప్రశ్నించేవారిపై తప్పుడుకేసులు పెడుతోందన్నారు.

వైసీపీ పాలనవల్ల అన్నివర్గాల వారు భయభ్రాంతులకు గురవుతున్నారని, ముఖ్యంగా యువత, రైతులు, మహిళల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తామంటున్న ప్రభుత్వం, కనీసమద్దతు ధరలపై దృష్టిపెట్టాలని, వరికి రూ.2,800, జొన్నకు రూ.2,570లు, రాగికి రూ.3,150లు, పెసరకు రూ.7,500లు, మినుముకి రూ.5,700లు, అమలయ్యేలా చూడాలని,వ్యవసాయరంగంపె రైతులకు చేసినసాయంపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆలపాటి డిమాండ్‌చేశారు.

నిమ్మకాయలకు  గిట్టుబాటుధరలేక తెనాలిమార్కెట్‌ యార్డ్‌లో వాటిని పారబోస్తున్నారని ఆయన చెప్పారు. 151మంది ఎమ్మెల్యేలున్నాకూడా,  తెలుగుదేశం ఎమ్మెల్యేలను లక్ష్యం చేసుకోవడంపై వైసీపీ దృష్టిసారించిందని, టీడీపీ అంటే అధికారపార్టీకి ఎందుకంత భయమని మాజీమంత్రి నిలదీశారు.

నాయకులను తయారు చేసే కర్మాగారమైన తెలుగుదేశంపార్టీకి ప్రతిపక్షపాత్ర కొత్తేమీ కాదన్నారు. ఎలా గెలిచాం, ఎందుకు గెలిచామనే సందిగ్ధావస్థలోనే వైసీపీ ఇప్పటికీ కొట్టుమిట్టాడుతోందని, క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కార్యకర్తల బలం లేనిస్థితిలో ఆ పార్టీ ఉందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు