ఏపీ వరద బాధితులకు నారా భువనేశ్వరి రూ.2 కోట్ల విరాళం

ఠాగూర్

బుధవారం, 4 సెప్టెంబరు 2024 (12:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని పలు వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు జలదిగ్భంధంలో చిక్కుకుని ఇక్కట్లు పడుతున్నారు. ఇలా వరద నీటిలో చిక్కుకుపోయి విలవిలలాడుతున్న బాధితులకు సహాయం చేసేందుకు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ముందుకు వచ్చారు. ఇటు తెలుగు చిత్ర సీమకు చెందిన వారు కూడా భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
 
ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.2 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తరపున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి చొప్పున విరాళం ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
 
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. "కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలబడాలి. సంక్షోభంలో బాధితులకు అండగా ఉండడమే మనం వారికి చేసే అతిపెద్ద సాయం. తెలంగాణ, ఆంధ్రాల్లో వచ్చిన వరదలు చాలా మంది జీవితాల మీద ప్రభావం చూపించాయి. వరద నీటిలో చిక్కుకుపోయి ఎంతో మంది ఇక్కట్లు పడుతున్నారు.
 
బాధిత ప్రాంతాలు, ప్రజలకు అందించే సహకారంలో మేం చేసిన ఈ సాయం వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని ప్రకటించడం జరిగింది. వరద ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు మా పూర్తి మద్దతు ఉంటుంది" అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు