తితిదే ఈవో నియామకంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు... దక్షిణాది ఐఏఎస్‌లు పనికిరారా?

సోమవారం, 8 మే 2017 (11:22 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారిగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారిని నియమించడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై ఆయన సోమవారం ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. తితిదే ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారిని నియమించడంలో తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, ఉత్తరభారత దేశంలో ఉన్న అమర్నాథ్, వారణాసిని, మథుర వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల నిర్వహణా బాధ్యతలను దక్షిణాది ఐఏఎస్‌ అధికారులను నియమించేందుకు అనుమతిస్తారా? అంటూ పవన్ ప్రశ్నించారు. 
 
ఉత్తరాదిలోని ఆలయాలకు దక్షిణాది ఐఏఎస్ అధికారులను నియమించేందుకు అంగీకరించనపుడు... దక్షిణాదిలోని ఆలయాలకు ఉత్తరాది ఐఏఎస్ అధికారుల నియామకాన్ని ఎందుకు అనుమతించాలని ఆయన ప్రశ్నించారు. పైగా, ఈ విషయంలో టీడీపీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు ఎందుకు మౌనంగా ఉండి ఎలా అనుమతించారో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది ప్రజలకు చంద్రబాబు వివరణ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. 
 
ఇదిలావుండగా, తితిదే ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్‌ను ఏపీ ప్రభుత్వం నియమించడం పట్ల సర్వత్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ నియామకానికి సంబంధించి దక్షణాది రాష్ట్రాల ఐఏఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఐఏఎస్ అధికారి దీనిపై మాట్లాడుతూ... ఉత్తరాదికి చెందిన అధికారికి ఈ పదవిని కట్టబెట్టడంపై దక్షిణాది ఐఏఎస్‌లు అసంతృప్తితో ఉన్నారని... దీనిపై జనసేనాని స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. అనేక విషయాల పట్ల పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందిస్తున్నారని... అదే విధంగా ఈ విషయంపై కూడా ఆయన ప్రశ్నించాలని కోరిన కొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్ స్పందించడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి