తమ ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ బారినపడిన రోగులకు వైద్య సేవలు అందిస్తుంటే పోలీసులు తమను అడ్డుకుంటున్నారని, దారుణంగా తిడుతూ, తమను కొట్టారని వైద్యులు ఆరోపించారు. బుధవారం ఉదయం కొందరు మెడికోలు వెళుతుండగా, అడ్డుకున్న పోలీసులు వారిని ముందుకు కదలనీయలేదని తెలుస్తోంది.
తాము వైద్యులమని ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పినా వినిపించుకోని పోలీసులతో మెడికోలు వాగ్వాదానికి దిగగా, వారిని కొట్టారన్నది ప్రధాన ఆరోపణ. దీన్ని నిరసించిన వైద్యులు స్థానిక లీలామహల్ సెంటర్‌లో ధర్నాకు దిగారు. తమపై చెయ్యి చేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, ధర్నా ప్రాంతానికి చేరుకుని, శాఖా పరమైన విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తామని హామీ ఇవ్వడంతో మెడికోలు ధర్నాను విరమించారు. అలాగే, మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో కూడా విధులు నిర్వహిస్తున్న మీడియాతో పాటు.. ఆస్పత్రులకు వెళుతున్న వైద్యులపై ఖాకీలు లాఠీ చార్జ్ చేశారు.