ఏపీకి భారీ వర్ష సూచన: 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కుమ్మేస్తాయట!

శనివారం, 15 మే 2021 (13:30 IST)
ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. లక్షద్వీప్ దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం బలపడిందని అమరావతి కేంద్రంగా ఉన్న భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి, లక్షద్వీప్ సమీపంలోని అమిని దీవికి దక్షిణ నైరుతి దిశగా 80 కిలోమీటర్ల దూరంలో, కన్నూరు (కేరళ)కు పశ్చిమ నైరుతి దిశగా 360 కిలోమీటర్ల దూరంలో, వెరావెల్ (గుజరాత్)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 1170 కి. మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు.
 
ఉత్తర-దక్షిణ ద్రోణి, ఆగ్నేయ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా, దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి, సముద్ర మట్టానికి 9 కిలోమీటర్ల ఎత్తులో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో దక్షిణ, ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
 
కాగా, ఈ అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వరకు వాతావరణంలో విభిన్న మార్పులు ఉంటాయని తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో శనివారం(మే 15,2021) ఉరుములు, మెరుపులతో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.  
 
దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో నేడు ఉరుములు, మెరుపులతో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక ఆదివారం ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
 
రాయలసీమలో ఉరుములు, మెరుపులతో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు