ఏపీ పాల‌న‌పై కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలున్నాయి...

శుక్రవారం, 24 డిశెంబరు 2021 (15:45 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో  శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా మారాయ‌ని, దీనిపై కేంద్ర హోం మంత్రి  టెలిస్కోప్ తో పరిశీలిస్తున్నార‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ చెప్పారు. రాజ్యాంగ విరుద్దంగా  వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకోవడానికి అవకాశాలున్నాయ‌న్నారు.
 
 
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో విలేఖ‌రుల సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశాన్ని బిజెపి కోర్ కమిటీ సభ్యులు, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ నిర్వహించారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, బిజెపి రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు, మీడియా డిపార్ట్ మెంట్  ఇంచార్జి లక్ష్మీపతి రాజా, ఒబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర రాజు లు పాల్గొన్నారు.
 
 
రాజ్యసభ సభ్యులు  సీఎం రమేష్ మాట్టాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాన్ని వ్యతిరేకిస్తూ  ఈ నెల28న పెద్ద ఎత్తున బిజెపి ఆద్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంద‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి  సినిమా టికెట్లపై ఉన్న శ్రద్ద, రాష్ట్రంలో పెరిగిన సిమెంట్, ఇసుక ధరలను నియంత్రించడంపై లేద‌న్నారు. సినిమా థియేటర్స్ యాజమాన్యంపై ప్రభుత్వం కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతోంద‌ని, ఒక వర్గంవారిపై ఉన్న శత్రుత్వాన్ని సినిమా పరిశ్రమపై చూపిస్తున్నార‌న్నారు.

 
రోడ్లు, అమరావతి, పోలవరం ఇలా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేద‌ని, ఎన్నికల సమయంలో పాద యాత్ర చేసిన ముఖ్యమంత్రి  ఇప్పుడు  రోడ్లపైకి రావాల‌న్నారు. మ‌ద్య‌పానం అంచెలంచెలుగా నిషేధం అన్నారు ఎక్కడ చేస్తున్నారు? మద్యం అమ్మకాలపై శ్వేత పత్రం విడుదల చేయాల‌ని డిమాండు చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో పాలన ఎలా ఉంది? ప‌క్క రాష్ట్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పాలన చూసి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల‌ని సూచించారు. కడప జిల్లాలో శంకుస్దాపనలే తప్పితే, నిర్మాణాలు లేవు.. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులు ప్రారంభించారా? స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సమయంలో ముఖ్యమంత్రి  ఏం మాట్లాడారో పరిశీలించుకోవాలన్నారు.
 
 
రాష్ట్రంలో పోలిస్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వానికి వివరించామ‌ని, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర పోలీస్ చర్యలను టెలిస్కోప్ లో క్షుణ్ణంగా పరిశీలిస్తుంద‌న్నారు. ఐ.పి.ఎస్. అధికారులు నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తున్నార‌ని, అవసరమైతే ఐ.పిఎస్ అధికారులను కేంద్రం రికాల్ చేస్తుంద‌న్నారు. త్వ‌రలోనే ఎపి పోలీస్ శాఖలో ప్రక్షాళన ఉంటుంద‌న్నారు. అమరావతిపై కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉంద‌ని, అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంద‌న్నారు. ఈనెల 28వ తేదీన జరిగే నిరసన కార్యక్రమాలలో జాతీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు.
 
 
బిజెపి  ఈనెల  28 నిర్వహించే భహిరంగ సభ వేదికను బీజేపీనేత‌లు పరిశీలించారు. పిన్నమనేని పాలీ క్లీనిక్ రోడ్డులోని  సిద్దార్ధ్ ఫార్మశీ కళాశాల గ్రౌండ్ ను  బిజెపి నేతలు పరిశీలించారు. వేదిక, ప్రాంగణంలో నిర్వహించే ఏర్పాట్లు పై చర్చ జరిపారు. ఎల్ ఇడి స్ర్కీన్ లు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వంపై ప్రజాగ్రహ సభ పేరుతో  ఈ సభను నిర్వహిస్తామని  సిఎం రమేశ్ ప్రకటించారు.
 
 
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు  బొబ్బూరి శ్రీరాం, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు,  ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు  షేక్ బాజీ, లక్ష్మీ పతిరాజా, ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసం ఉమామహేశ్వర రాజు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు